Amit Shah Attacks KCR: కేసీఆర్ సర్కార్ పతనానికి ఇదే ఆరంభం : అమిత్ షా
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
- By Naresh Kumar Published Date - 09:11 PM, Sun - 21 August 22

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి బోతున్నారని బీజేపీ అగ్ర నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని చెప్పారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్ సర్కార్.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం… మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు సంక్షేమ పథకాలు తెలంగాణ రైతాంగానికి అందకుండా చేసి పాపానికి పాలుపడుతున్నారనీ ఆరోపించారు. తెలంగాణలో టీచర్ల రిక్రూట్‌మెంట్ 2014 నుంచి మూతపడిందనీ, కేసీఆర్ కుటుంబానికి అయితే రిక్రూట్‌మెంట్ ఓపెన్ ఉందన్నారు.అయితే తెలంగాణ యువతకు మాత్రం రిక్రూట్‌మెంట్ లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమన్న ఆయన తన ప్రభుత్వం ఏర్పడితే దళిత/షెడ్యూల్డ్ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.
దళిత సోదరులు మళ్లీ ఈ అవినీతిపరుల ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సహకరిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రావచ్చు గానీ ఏ దళిత వ్యక్తిని సీఎం కానివ్వరనీ అమిత్ షా అన్నారు. తన ప్రసంగంలో అమిత్ షా మజ్లిస్ , కేసీఆర్ దోస్తీ పైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం వమ్ము చేసిందనీ, మజ్లిస్ భయంతో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. మోదీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామనీ అమిత్ షా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి జోస్యం పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
https://twitter.com/AmitShah/status/1561362869153038337
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం లాంటిదని అమిత్ షా చురకలు వేశారు. తెలంగాణలోనే అధిక ధరలు వున్నాయని.. పెట్రో ధరలు ఎక్కువని, పన్నులు కూడా తగ్గించలేదని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రో ధర తగ్గించిందని.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అమిత్ షా చురకలు వేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా వుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు.
Live from Public Meeting from Munugode. https://t.co/4v9YxZZKuB
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 21, 2022