KCR Politics: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ మళ్లీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్.. మంచి వ్యూహకర్త. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవ్వరికీ అంతుపట్టదు. 2018లో ఇంకా ఏడాది సమయం ఉన్నప్పుటికీ...ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
- By Hashtag U Published Date - 06:30 AM, Sat - 26 March 22

తెలంగాణ సీఎం కేసీఆర్.. మంచి వ్యూహకర్త. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవ్వరికీ అంతుపట్టదు. 2018లో ఇంకా ఏడాది సమయం ఉన్నప్పుటికీ…ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని ఎవరూ ఊహించలేరు. అప్పట్లో గులాబీ బాస్ స్ట్రాటజీ ఫలించింది. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ మరోసారి జిల్లాల వారీగా గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకుంటున్నారట. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది.
ముందస్తుకు వెళ్తారని వస్తున్న వార్తలను గులాబీ అధినేత ఖండించినప్పటికీ…ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు…వేస్తున్న అడుగులు ఆ దిశగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గులాబీ బాస్ ముందస్తు నిర్ణయం ఎలా ఉంటుందోనని…ముందు జాగ్రత్తలు పడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లునున్నారని..పార్టీ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాయి.
2018లో ముందస్తు ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్ లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు సీఎం కేసీఆర్. ఐదేళ్ల పాలనకాలం పూర్తవ్వకముందే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తుకు వెళ్లి భారీ విజయాన్ని సాధించి…అధికారాన్ని చేపట్టారు. అయితే ఇప్పుడు కూడా మరోసారి ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం టీఆరెస్ ప్రభుత్వ పదవీకాలం…ఇంకో ఏడాది ఉన్నప్పటికీ…ముందస్తు ప్రచారం జోరుగానే సాగుతోంది. కొందరు టీఆరెస్ నేతల నోట ముందస్తు మాట వస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లవుతుంది.
ఇవి ముందస్తు సంకేతాలేనా..?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తుంటే…ఇవన్నీ కూడా ముందస్తుకు సంకేతాలేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్ లో సంక్షేమానికే మొగ్గు చూపారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా తీసుకువచ్చిన దళితబంధు పథకంపై విపక్షాల నోరుమూయించేందుకు..బడ్జెట్ లో దళిత బంధుకు 17,700కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని సేకరించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడం, 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించడం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవడం, టీఆరెస్ మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపించడం…వీటి ఆధారంగా సీఎం కేసీఆర్ ప్రస్తుత రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ..ముందుకు సాగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రజల పల్స్ ను తెలుసుకునేందుకు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్టును చేయిస్తున్నారు గులాబీ బాస్.
తెలంగాణపై బీజేపీ నజర్ లేకుండా…?
ప్రస్తుత అసెంబ్లీకి వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సమయం ఉన్నప్పటికీ…కేసీఆర్ ఎలాంటి అవకాశాలను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బీజేపీ తన హిందూత్వ నినాదంతో రాజకీయ లబ్ది పొందకుండా అడ్డుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నందున…ముందుస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలనే ఆ పార్టీ ప్రణాళికలను అడ్డుకునే ఛాన్స్ ఉందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలకు చేరువుతున్నప్పటికీ…గత ఏడాది జూన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం…ఆ పార్టీ సీనియర్ నేతలకు ఏమాత్రం మింగుబాటు కావడం లేదు.
వీటన్నింటినీ గులాబీ బాస్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ సారి కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను ఎంచుకుని…జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొంత కాలంగా కేంద్రంపై మాటలతో విరుచుకుపడుతున్న కేసీఆర్…దేశాన్ని బాగుచేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఉత్తరాదిలో బీజేపీ మంచి ఫలితాలను రాబట్టడంతో..రాష్ట్రంలో కాషాయ పార్టీ బలం పెరగడం కేసీఆర్ ఏమాత్రం ఇష్టం లేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై గులాబీ అధినేత తీవ్రస్ధాయిలో విమర్శలు సందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ హస్తినా వేదికగా పోరాడేందుకు పార్టీ శ్రేణులు రెడీ చేస్తున్నారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్ తో ఆందోళనలకు దిగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న వార్త మాత్రం బలంగానే వినిపిస్తోంది.