Bandi Sanjay: అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగునపడేసింది: బండి సంజయ్
- By Balu J Published Date - 10:52 PM, Wed - 21 February 24
Bandi Sanjay: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ బిజెపి విజయసంకల్ప యాత్రలో భాగంగా పాల్గని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
నిర్మల్లోని వేయిఉరుల మర్రి అమరవీరులకు బిజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావుతో కలిసి నివాళులర్పించారు. వేయి ఉరుల మర్రి స్థానంలో ఎలాంటి కట్టడం లేదని, ఓట్ల రాజకీయాల కోసం ఇక్కడ ఒక వర్గానికి చెందిన సమాధి ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ అమరవీరుల స్మారక స్తూపంతో పాటు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్మృతి వనం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు సహకరించాలని పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేసారన్నారు. వెయ్యి ఉరుల మర్రి చరిత్రను సమాజానికి తెలియజేసిన వ్యక్తి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అని అన్నారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకూడదనుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.