Rythu Bandhu : రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం – కేసీఆర్
ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతుందని కేసీఆర్ స్పష్టం
- Author : Sudheer
Date : 27-11-2023 - 5:14 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election campaign) ముగింపుకు కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఈ కొద్దీ సమయంలో ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ హామీలతో..ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో హడావిడి చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR) తన మాటల తూటాలను మరింతగా వదులుతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రచారం చేస్తూ వస్తున్న కేసీఆర్..కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి తీసేస్తుందని , రైతుబంధు ఆపేస్తుందని , 24 గంటల కరెంట్ ఇవ్వదని..అమలు కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తుందని చెపుతూ వస్తున్నారు. తాజాగా రైతుబంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయడం వెనుక కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు.
సోమవారం చేవెళ్లలో బీఆర్ఎస్ (BRS) ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై (Congress Party) విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుల వల్లే రైతు బంధు నిధులకు బ్రేక్ పడిందని అన్నారు. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక రైతుబంధుతోనే ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
చేవెళ్ల నుంచి తెలంగాణ రైతులకు తెలియజేస్తున్నా. మీరేం రంది పడాల్సిన అవసరం లేదు. మళ్ల వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా.. వాళ్ల శక్తి అంతా మూడో తారీఖు వరకే. ఆరో తేదీ నుంచి రైతుబంధు యథావిధిగా వస్తది ఏం బాధపడొద్దని చెబుతున్నా. అంటే గీంత నీచంగా ఆలోచిస్తరు. రైతుబంధు కొత్తది కాదు కదా..? ఆరేడు ఏండ్ల నుంచి ఇస్తున్నం. అది రెగ్యలర్ కార్యక్రమం. కొత్తగా సాంక్షన్ చేయలేదు. దాన్ని కూడా ఆపితే మనకు లాభం జరుగుతదేమో అని కాంగ్రెసోళ్లు ఆలోచిస్తున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ ఇలా అంటే రేవంత్ రెడ్డి మాత్రం రైతు బంధు నిధులు ఆగిపోవడానికి మంత్రి హరీష్ రావే అని విమర్శించారు. రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి మేం విజ్ఞప్తి చేశామని.. ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల… రైతు బంధు ఆగిందని విమర్శించారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని విమర్శించారు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా… రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు. మొత్తం మీద ఎన్నికల చివరి సమయంలో రైతుబంధు మీద రచ్చ తో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడబోతోంది.
Read Also : Jagga Reddy : కాంగ్రెస్ పార్టీకి బలం ‘జగ్గారెడ్డి’