KCR Tour : జిల్లాల పర్యటనకు ‘గులాబీ దళపతి కేసీఆర్’.!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి(శుక్రవారం) నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు.
- By Hashtag U Published Date - 10:45 AM, Fri - 11 February 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి(శుక్రవారం) నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం, నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ జనగామ, రేపు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు గులాబీ బాస్. వచ్చే ఏప్రిల్ 27 నాటికి అన్ని జిల్లాల్లో పార్టీ భవనాలకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను పూర్తి చేయాలని సంకల్పించారు. అలానే మే నెల నుంచి నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టాలని గులాబీ దళపతి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన 2001 లో ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో అద్దె భవనాల్లోనే పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. సభలు, సమావేశాలు, శిక్షణ శిబిరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల కోసం సొంత భవనాలుండాలని భావించిన గులాబీ బాస్… వరంగల్, హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లో ఎకరం చొప్పున భూమిని కేటాయించారు. అన్నింటికీ ఒకే నమూనాను ఆయన సూచించారు. భూమి కొనుగోళ్లు, నిర్మాణ వ్యయాలను టీఆర్ఎస్ పార్టీనే భరించింది. 2019 వ సంవత్సరంలో కొన్ని, 2020 లో మరికొన్ని జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయి. గతేడాది అక్టోబరు నాటికి అవి సిద్ధం కాగా… వీటిలో ముందుగా సిద్దిపేట పార్టీ కార్యాలయాన్ని గులాబీ దళపతి కేసీఆర్ ప్రారంభించారు. మిగిలిన వాటిని దశలవారీగా పూర్తి చేయాలని భావించినప్పటికీ… పలు కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో ముందుగా వీటన్నిటినీ పూర్తిచేయాలనే తలంపుతో ముందుకు వెళుతున్నారు పార్టీ అధ్యక్షులు కేసీఆర్. ఇకపోతే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దీంతో ఒకవైపు పాలనను పరుగులు పెట్టిస్తూనే, ఇంకోవైపు పార్టీ కార్యక్రమాలను సైతం ఉరుకులు పెట్టించాలని అధినేత డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే పార్టీ జిల్లా కార్యాలయాను వీలైనంత తర్వగా ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టిన నేపధ్యంలోనే గత నెలలో అన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టారు. వారంతా కూడా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా జిల్లా కార్యాలయాలను సన్నద్ధం చేయాలని భావించారు. దీని కోసం నేడు జనగామ, రేపు భువనగిరి జిల్లాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఆ తర్వాత హన్మకొండ, నిజామాబాద్, వనపర్తి తదితర జిల్లాల కార్యాలయాలను ప్రారంభించనున్నారు. రానున్న ఏప్రిల్ 27 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఆ సమయానికల్లా అన్ని జిల్లాల కార్యాలయాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న జాతీయ కార్యాలయాన్ని సైతం సిద్ధం చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది అధికార తెరాస పార్టీ.
జిల్లాల పర్యటన సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి… ఎవరిని పక్కన పెట్టాలి అనేది కూడా కేసీఆర్ నిర్ణయిస్తారని టాక్ వినిపిస్తోంది. అంటే… వారి పనితీరును బేరీజు వేసుకుని, వారికి అవకాశం ఇవ్వనున్నారట. అలానే ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల పనితీరుతో పాటు, పార్టీకోసం ముందునుంచి కష్టపడి, అవకాశం రాకుండా ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నారో అన్నది కూడా లెక్కలు తీస్తున్నారట గులాబీ దళపతి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా… వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హోరంగా విఫలమవుతున్న నేతలను సైతం గుర్తించిన కేసీఆర్… వారి విషయంలో కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టడంలో కొంతమేర సక్సెస్ అయిన భారతీయ జనతా పార్టీ… తామే తెరాసకు అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగ సమస్య… అంటూ విమర్శల దాడి చేస్తూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్… ఎలాంటి వ్యూహాలకు పదునుపెడతారో…. ఎలా ముందుకు వెళతారో అన్నది వేచి చూడాలి.