Kakatiya Toranam : నగరాల ముస్లిం పేర్లలో రాచరికం కనిపించడం లేదా ? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
- By Pasha Published Date - 01:29 PM, Sat - 1 June 24

Kakatiya Toranam : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక చిహ్నంలో అమరుల స్థూపాన్ని చేర్చే విషయంలో తమకు అభ్యంతరమేం లేదని ఆయన తెలిపారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 1970వ దశకంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలీసులతో కాల్పులు జరిపించి దాదాపు 370 మంది ఉద్యమకారులను బలిగొందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘చార్మినార్ గుర్తును(Kakatiya Toranam) తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించడంతో పాటు ముస్లిం పాలకుల ఆనవాళ్లను యావత్ రాష్ట్రం నుంచి తొలగించాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలేటి కోరారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం పాలకుల మొత్తం ఆనవాళ్లను తొలగిస్తామని ప్రకటించారు. ‘‘ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై అరాచకాలు చేశారు. ఎదులాపురంను ఆదిలాబాద్ గా, లష్కర్ ను సికింద్రాబాద్ గా, ఎలగందులను కరీంనగర్ గా, పాలమూరును మహబూబ్ నగర్ గా, మానుకోటను మహబూబాబాద్ గా, ఇందూరును నిజామాబాద్ గా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వీటిలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా? వీటిని ఎందుకు మార్చడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
Also Read : ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్
తెలంగాణ కొత్త సచివాలయంలో 34 గుమ్మటాలను ఒవైసీ ఆనందం కోసం కేసీఆర్ నిర్మించారని.. వాటిని ఎందుకు తొలగించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మజ్లిస్ పార్టీని బుజ్జగించడమే లక్ష్యంగా పాలన సాగిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ముద్రలను తొలగించి చేతులు దులుపుకుంటోందన్నారు. ‘‘సుష్మా స్వరాజ్, బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. రేవంత్ చరిత్ర తెలుసుకోవాలి.. బీజేపీ నేతలను ఆవిర్భావ వేడుకలకు పిలవాలి. చరిత్ర మిమ్మల్ని ఏనాటికీ క్షమించదు’’ అని ఏలేటి కామెంట్ చేశారు.