Telangana BJP : కమలకోట రహస్యం.!
తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బండికి వ్యతిరేక గ్రూప్ సిద్ధం అయిందా?
- By CS Rao Published Date - 05:50 PM, Tue - 22 February 22

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బండికి వ్యతిరేక గ్రూప్ సిద్ధం అయిందా? గ్రూప్ పాలిటిక్స్ కు బీజేపీ అవకాశం ఇస్తుందా? ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే గ్రూప్ రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధిష్టానం వద్ద రేకెత్తుతున్నాయి. సాధారణంగా గ్రూప్ పాలిటిక్స్ కు బీజేపీ ఢిల్లీ అధిష్టానం ఛాన్స్ ఇవ్వదు. కానీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ అధ్యక్షులపై గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయనేది జగద్వితం. ప్రత్యేకించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల రహస్యంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ తో సద్దుమణిగిన గ్రూప్ మళ్లీ రహస్య సమావేశాన్ని నిర్వహించింది.ఇటీవల కరీంనగర్ కు చెందిన లీడర్ల మాత్రమే బండికి వ్యతిరేకంగా గ్రూప్ కట్టారు. ఆయన వాలకంపై ఢిల్లీ అధిష్టానం వద్ద ఫిర్యాదు కూడా చేశారు. కానీ, ఢిల్లీ పెద్దలు మాత్రం బండికి మద్ధతు పలికారు. దీంతో అప్పట్లో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మంగళవారం రహస్యంగా భేటీ అయ్యారు. ఈసారి కరీంనగర్ తో పాటు హైదరాబాదుకు చెందిన కొందరు బీజేపీ నేతలు భేటీ అయ్యారు. వాళ్లలో ప్రధానంగా గుజ్జుల రామకృష్ణ, సుగుణాకర్, వెంకటరమణి, రాములు తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరోమారు బీజేపీ తెలంగాణ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు రెండు పర్యాయాలు కొనసాగారు. వివాద రహితునిగా దత్తాత్రేయ కొనసాగారు. అందరికీ ఆమోదయోగ్యమైన లీడర్ గా ఉండే వాళ్లు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. ఆ తరువాత కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కొనసాగారు. తొలుత వివాదరహితునిగా ఉన్నప్పటికీ ఆ తరువాత రెండో పర్యాయం ఆయన మీద ఒక గ్రూప్ గుర్రుగా ఉండేది. ఆయన ప్రస్తుతం పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన తరువాత లక్ష్మణ్ రెండు పర్యాయాలు బీజేపీ అధ్యక్షునిగా కొనసాగాడు. కొందరు ఆయన నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించారు. ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతోన్న బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన్ను కొందరు స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే రాజకీయంగా ఎదిగిన లీడర్ గా బండికి గుర్తింపు ఉంది.మండల స్థాయి నుంచి ఒకేసారి పార్లమెంట్ స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఆయన్ను వరించింది. దూకుడుగా తెలంగాణ బీజేపీని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కిషన్ రెడ్డిని కూడా కాదని కొన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో ప్రధానంగా పవన్ కల్యాణ్ వ్యవహారం ప్రధానంగా ఉంది. తెర వెనుక కిషన్ రెడ్డి అనుచరులు బండికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని బీజేపీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. తొలి నుంచి. కిషన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉండేదని టాక్. ఆ గ్రూప్ కు ప్రస్తుతం బండి ప్రాధాన్యం ఇవ్వడంలేదని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి , కిషన్ రెడ్డి గ్రూప్ ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగిందని వినికిడి. అప్పటి నుంచి గ్రూపులుగా విడిపోయిన బీజేపీ పైకి మాత్రం ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. లోలోన ఎవరికి వారే గోతులు తవ్వుకుంటున్నట్టు అర్థం అవుతోంది. ఆ క్రమంలోనే రహస్య మీటింగ్ మంగళవారం జరిగింది. ఈసారి ఢిల్లీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో..చూడాలి.