KTR: మోడీకి, రేవంత్ రెడ్డి కి ఓటు వేస్తే సింగరేణిని అదానీకి అమ్మేస్తారు : కేటీఆర్
- By Balu J Published Date - 04:42 PM, Sat - 11 May 24

KTR: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్ లో జరిగిన బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, రైతు భరోసా, బోనస్, తులం బంగారం, స్కూటీలు ఇలా ఎన్నో హామీలు చెప్పారు. ఏదైనా ఒక్కటైనా అమలైందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మరి రుణమాఫీ అయ్యిందా? పెద్దపల్లి అభ్యర్థి కోటీశ్వరుడు కదా? ఆయన అయినా సరే ఇచ్చిండా రైతులకు ఏమైనా ఇచ్చిండా? అయిన సరే మొండి చెయ్యికి గుద్దుదామా? కాంగ్రెస్ మళ్లీ ఓటు వేద్దామా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
పెద్దమనుషులకు ఇస్తా అన్న 4 వేలు ఇచ్చుడు కాదు… జనవరి నెల రూ. 2 వేలు ఎగగొట్టిండని, రేవంత్ రెడ్డి ఇచ్చినా హామీలు ఏమైనా ఒక్కటైనా అమలయ్యా అని, రైతుబంధు నాట్లప్పుడు ఇవ్వలే గానీ…ఓట్లప్పుడు ఇస్తున్నాడు. అందుకే గ్రామాల్లో రైతులు తిడుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
‘‘తెలంగాణ రైతు ఆగమైండు. మళ్లీ ఆత్మహత్యలు మొదలైనయ్. మోడీకి, రేవంత్ రెడ్డి కి ఓటు వేస్తే సింగరేణిని అదానీకి అమ్మేస్తాడు. జనవరి లోనే స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికి మోడీ మద్దతు ఉంది. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ ఏం చేసిండంటే యువకులు, ప్రజలు ఎవరు చెప్పటానికి ఏమీ లేదు. ఏమైనా అంటే బీజేపోళ్లు గుడి కట్టినం అంటారు. మరి కేసీఆర్ కట్టలేదా యాదాద్రి? ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్ట్ లు కట్టిండు. తెలంగాణ బతుకును బాగు చేసిండు’’ అని కేటీఆర్ అన్నారు.