Hydraa : రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? – కేటీఆర్ సూటి ప్రశ్న
Hydraa : పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇంటిని కూల్చే దమ్ము ఉందా అని ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది
- By Sudheer Published Date - 03:58 PM, Sun - 24 August 25

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)కి సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చివేసే దమ్ము హైడ్రాకు ఉందా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లోనే రూ. 2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ విమర్శించారు. శేరిలింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. ఏ అభివృద్ధి కోసం పార్టీ మారారని ప్రశ్నించారు. ఈ 20 నెలల్లో ఆయన సాధించిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పే ధైర్యం కూడా లేదని, ఉప ఎన్నికల్లో గెలిచే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు.
పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడి ఇంటిని కూల్చే దమ్ము ఉందా అని ప్రశ్నించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.