HYD : చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం..దీనికి కారణం వారేనా..? ఇలా జరగకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి..?
HYD : GO 111ను మరింత కఠినంగా పునరుద్ధరించాలని, చెరువులు, నాలాలు, ముసి వరద మైదానాల్లోని అన్ని అక్రమ కట్టడాలను, అవి ఎంత శక్తివంతమైనవి అయినా, కూల్చివేయాలని డిమాండ్ చేసింది
- By Sudheer Published Date - 08:04 PM, Sun - 10 August 25

ఒకప్పుడు వేలాది చెరువులకు నిలయమైన హైదరాబాద్ నగరం (Hyderabad) నేడు చిన్న వర్షానికే మునిగిపోవడం వెనుక దశాబ్దాల కుట్ర ఉంది. 1970ల నుండి 2000 వరకు రాజకీయ నాయకులు, బిల్డర్లు, ల్యాండ్ మాఫియా కలసి పనిచేసి రాత్రికి రాత్రే చెరువులను అదృశ్యం చేసి, రికార్డులు మార్చి అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం వల్లే ఈరోజు హైదరాబాద్ కు ఈ పరిస్థితి వచ్చింది. తమ స్వలాభాల కోసం పర్మిషన్ లు ఇవ్వడం వల్లే ఈరోజు చిన్న వర్షం పడినాసరే రోడ్లు చెరువులను తలపిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. దుర్గం చెరువు, నల్లా చెరువు, సరూర్ నగర్ చెరువులు ఆక్రమణలకు గురై మురుగునీటి చెత్తకుండీలుగా మారాయి. ఒకప్పుడు 3,000 పైగా ఉన్న చెరువులు ఇప్పుడు 200 కన్నా తక్కువకు ఉండడానికి కారణం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలే. నేటి విధ్వంసానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ సంస్థలే.
తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వ హయాంలో (2014-2023) ఈ విధ్వంసం మరింత ఎక్కువైంది. ముఖ్యంగా కేసీఆర్ పాలనలో 84 చెరువులను రక్షించే GO 111ను 2021లో రద్దు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్గం సుగమం చేసారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిసరాల్లోని బఫర్ జోన్లలో వేల ఎకరాలు నిర్మాణాలకు తెరిచి, నీరు ప్రవహించే ప్రదేశాల్లో గోల్ఫ్ మైదానాలు, లగ్జరీ విల్లాలు నిర్మించారు.
ఈ అక్రమ నిర్మాణాల ఫలితంగానే 2023 నుండి హైదరాబాద్‌లో వరదలు మొదలయ్యాయి. తేలికపాటి వర్షం పడినా కుకట్‌పల్లి, నిజాంపేట్, మాదాపూర్ వంటి ప్రాంతాలు మునిగిపోతున్నాయి. దీనికి కారణం ముసి వరద మైదానాలు బ్లాక్ అవ్వడం, నాలాలు చెత్తతో, ఆక్రమణలతో మూసుకుపోవడం మరియు చెరువులకు నీరు నిల్వ చేసే స్థలం లేకపోవడమే. బహుజన రియల్ ఎస్టేట్ మాఫియా, అవినీతి అధికారులు లంచాలు తీసుకుని అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడం , గత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలు ముడుపులు చెల్లించడం వల్లే ఈరోజు హైదరాబాద్ ఓ నీటి సంద్రంగా మారింది.
ఈ సమస్యకు పరిష్కారం.. GO 111ను మరింత కఠినంగా పునరుద్ధరించడం. చెరువులు, నాలాలు, ముసి వరద మైదానాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయడమే. ఈ విధ్వంసానికి కారణమైన రాజకీయ నాయకులు, అధికారులఫై కఠిన శిక్షలు విధించాలి. వరద నష్టం కోసం బిల్డర్లే ఖర్చు భరించాలి. అంతే కాదు కేటీఆర్ ఫామ్ హౌస్‌తో సహా అక్రమ నిర్మాణాలపై చేపట్టిన HYDRAA కూల్చివేత డ్రైవ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. దీనికంతటికి కారణమైన కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.