Heavy Rain in Hyderabad : గ్రేటర్ లో భారీ వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం..
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో చాలాచోట్ల హోర్డింగ్స్ , ప్లెక్సీ లు , తదితర బోర్డ్స్ ఊడిపడ్డాయి
- By Sudheer Published Date - 08:10 PM, Tue - 7 May 24

మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) హైదరాబాద్ (Hyderabad) నగరం తడిసి ముద్దయింది. నిన్నటి వరకు రోహిణి కార్తెకు ముందే రోళ్లు పగిలేలా ఉష్ణోగ్రతలు దడపుట్టించాయి. ఉదయం 07 గంటలకు భానుడి ఉగ్రరూపం దాలుస్తు భగభగమనడం మొదలుపెడుతూ వచ్చాడు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు పెరగడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 9 దాటితేనే ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. రెండు రోజులుగా 48 , 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ఎండలు కాస్త తగ్గితే బాగుండని అంత అనుకున్నారు. ఈ లోపే ఈరోజు మంగళవారం నగర వ్యాప్తంగా గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడం తో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో చాలాచోట్ల హోర్డింగ్స్ , ప్లెక్సీ లు , తదితర బోర్డ్స్ ఊడిపడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
జీహెచ్ఎంసి పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి పరిధిలో ముందుగా వర్షం మొదలైంది. అక్కడి నుంచి గచ్చిబౌలి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి, ముసాపేట్, చందానగర్ ,కూకట్ పల్లి, మూసాపేట, జూబ్లీహిల్స్, మియాపూర్ సర్కిళ్లకు విస్తరించింది. అటు తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లోనూ కూడా వర్షం కురిసింది. అంబర్ పేట, నల్లకుంట, నాచారం పరిధిలోనూ వాన ముంచెత్తింది. అలాగే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాతబస్తీలోని చార్మినార్, బార్కాస్, బహదూర్పురా ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం కురిసింది. భారీగా వీచిన ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఇక ట్రాఫిక్ (Traffic Jam) గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐదు నిమిషాల వర్షం పడితేనే ట్రాఫిక్ జాం అవుతుంది. అలాంటిది గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు , అధికారులు రంగంలోకి దిగారు. పలు రూట్లలో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు.
Read Also : Ambati Rambabu : అంబటి రాంబాబు సంబంధించి మరో బండారం బయటపెట్టిన అల్లుడు