Telangana High Court : మరోసారి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా
Telangana High Court : స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.
- Author : Latha Suma
Date : 07-11-2024 - 5:25 IST
Published By : Hashtagu Telugu Desk
MLAs Disqualification Petition : తెలంగాణ హైకోర్టులో ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. దీంతో గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. మొదట కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. అసలు ఈ అప్పీల్‌లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు.
పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.