Hyderabad : ఆంక్షలపై హరీష్ రావు ఆగ్రహం..మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చింది
Hyderabad : హైదరాబాద్ లో ఐదుగురి కంటే ఎక్కువ జమ కావొద్దా..? ఇవన్నీ చూస్తుంటే నగరంలో మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చినట్లు ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు
- By Sudheer Published Date - 05:48 PM, Mon - 28 October 24

హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ ప్రాంతాల్లో (Secunderabad Areas) భద్రతా కారణాలతో బీఎన్ఎస్ సెక్షన్ 163 (Section 163 of BNS) కింద అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షల ప్రకారం, 5 మందికి మించి గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించబడింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వదద శాంతియుతంగా చేపట్టనున్న ధర్నాలు, ర్యాలీలు, నిరసనలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఈ నెల రోజుల సమయంలో హైదరాబాద్ లో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని.. ఎవరైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఆంక్షలపై హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు.
పండుగలు, పెండ్లిళ్ల సీజన్ లో హైదరాబాద్ మహానగరంలో 144 సెక్షన్ పెట్టడం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఐదుగురి కంటే ఎక్కువ జమ కావొద్దా..? ఇవన్నీ చూస్తుంటే నగరంలో మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చినట్లు ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే.. ఎవరూ పెండ్లి చేసుకోవద్దు, బట్టలు కొనుక్కొవద్దు, పండుగలు కూడా చేసుకోవద్దు అనేలా ఉందని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వల్ల ఏ ఒక్కరు సంతోషంగా నిలేరని, ప్రతి వర్గం రోడ్డెక్కిందన్నారు.
పురుగుల లేని అన్నంకోసం గురుకుల విద్యార్థులు, స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతులు, జీతాల కోసం అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలనీ జీపీ సిబ్బంది, ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ నీ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు, మా సమస్యలు పరిష్కరించండని పోలీసులు, పెన్షన్ల కోసం వృద్ధులు.. ఇలా అందరూ రోడ్డెక్కుతున్నారు. బడికి పోయే పిల్లల నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రోడ్డెక్కించిన పరిస్థితి రేవంత్ రెడ్డిది. పదేండ్ల పాటు అన్ని వర్గాలను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే.. నీ పది నెలల పాలనలో అందర్నీ రోడ్డెక్కించిన చరిత్ర నీది అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు .
Read Also : Krishnapatnam Port : సెక్యూరిటీ గార్డులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం