Bhadradri Temple : ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం టికెట్లు
Bhadradri Temple : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
- By Pasha Published Date - 01:54 PM, Mon - 25 March 24

Bhadradri Temple : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా.. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. 18న పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించామని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. ఈ టికెట్లను https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందొచ్చన్నారు. ఈ రెండు వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
భద్రాద్రి రామయ్య కల్యాణం(Bhadradri Temple) రోజున ప్రత్యక్షంగా వేడుకలకు రాలేని భక్తులు.. పరోక్ష పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటును కల్పించారు. దీనికోసం రూ.5000, రూ.1116 టికెట్లనూ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, తానీషా కల్యాణ మండపం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను విక్రయించనున్నారు.
Also Read :Ghost Jobs : ‘ఘోస్ట్ జాబ్స్’కు అప్లై చేశారో.. జరిగేది అదే !!
భద్రాద్రి రాములోరి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలను ఇవాళ తిరుమల తిరుపతి సేవా కుటుంబం సమర్పించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ధాన్యాన్ని పంపించి రామనామ జపం చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను సిద్ధం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా గోటి తలంబ్రాలను తిరుమల తిరుపతి సేవా కుటుంబం సమర్పిస్తోంది. గతేడాది తలంబ్రాల ప్యాకింగ్ మిషన్ను కానుకగా అందించగా.. ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి 108 బస్తాల బియ్యాన్ని కానుకగా అందించారు.