Ganja : మెడికల్ షాపులకు తంటాతెచ్చిన `గంజా` అణచివేత
గంజాయి మత్తు వదిలించడానికి తెలంగాణ పోలీసులు పెట్టిన ఫోకస్ ఫలించింది. కానీ, మత్తుకు అలవాటు పడిన వాళ్లు కొన్ని రకాల నార్కోటిక్ డ్రగ్స్ వైపు మళ్లారు. మత్తు మందులు కోసం మెడికల్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు.
- By Balu J Published Date - 02:18 PM, Tue - 2 November 21

గంజాయి మత్తు వదిలించడానికి తెలంగాణ పోలీసులు పెట్టిన ఫోకస్ ఫలించింది. కానీ, మత్తుకు అలవాటు పడిన వాళ్లు కొన్ని రకాల నార్కోటిక్ డ్రగ్స్ వైపు మళ్లారు. మత్తు మందులు కోసం మెడికల్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ పరిణామాన్ని గమనించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు మెడికల్ షాపులు, హోల్ సేల్ డీలర్లకు కొన్ని ప్రత్యేక ఆంక్షలు పెట్టింది. డాక్టర్ అనుమతి లేకుండా మత్తు మందులు విక్రయించడానికి లేదని అక్టోబర్ 25వ తేదీన నోటీసులు జారీ చేసింది. మెడికల్ షాపుల విక్రయాలు, డీలర్ల సరఫరాకు సంబంధించిన రికార్డ్ లను పక్కాగా నిర్వహించాలి. ఆడిట్ కూడా చేయించాలని డీసీఏ నిబంధన పెట్టింది.
డగ్స్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు పోలీసులతో సమావేశాలను నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల్లో ఏ విధంగా మత్తు మందుల విక్రయం జరుగుతుందో అధ్యయనం జరిగింది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940 ప్రకారం మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్) అనుమతి లేకుండా మత్తు బిళ్లలు లేక ఇంజక్షన్లు అమ్మకూడదు. కానీ, కొన్ని మెడికల్ షాపులు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించిన డ్రగ్స్ కంట్రోల్ బోర్డు, అలాంటి విక్రయాలను ఆపేసే ప్రయత్నం చేయడానికి పోలీసుల సహాయం తీసుకుంది. కొన్ని రకాల వ్యాధుల నివారణకు మత్తు మందులు వాడాలి. ప్రధానంగా మానసిక వైకల్యం, దౌర్భల్యం, ఒత్తిడి, నొప్పులు..తదితరాల కోసం డాక్టర్లు కొన్ని రకాల డ్రగ్స్ ను వాడమని చెబుతారు. ఆ మేరకు వైద్యులు ప్రిస్కిప్షన్ రాస్తారు. వాటిని మెడికల్ షాపుల్లో చూపిస్తేనే సంబంధిత మందులు ఇవ్వాలి. తద్భిన్నంగా జరగడం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది.
తాజాగా అలాంటి విక్రయాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. గంజాయిని తెలంగాణ ప్రభుత్వం కట్టడీ చేయడంతో మాదకద్రవ్యాల వ్యసనపరులు మత్తు మందుల వైపు మళ్లారు. దీంతో మెడికల్ షాపులు విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితిని కట్టడీ చేయడానికి నోటీసులు ఇచ్చారు. ఇక నుంచి మెడికల్ షాపుల యజమానులు రికార్డ్ ను నిర్వహించాలి. ప్రతి రోజూ మత్తు మందులు ఎన్ని విక్రయించారు? డాక్టర్లు ఎన్ని మందులు సూచించారు? ఎలాంటి వాటిని వాడమని డాక్టర్లు చెప్పారు? ఇలాంటి అంశాలపై డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సమీక్షిస్తారు. అందుకోసం ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా మెడికల్ షాపులు విక్రయించిన మత్తు మందులు, హోల్ సేల్ డీలర్లు సరఫరా చేసిన పరిమాణం ఎంత? తదితరాలను పరిశీలిస్తారు. మొత్తం మీద గంజాయి సరఫరా వ్యవహారం మెడికల్ షాపుల వాళ్లకు తలనొప్పి తెచ్చిందన్నమాట.
Related News

Ganja In Hyderabad: హైదరాబాద్లో 450 కిలోల గంజాయి స్వాధీనం
మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు