Gaddar Daughter : సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ గద్దర్ కూతురికే ?
Gaddar Daughter : ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ (రిజర్వుడు) స్థానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
- Author : Pasha
Date : 08-10-2023 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Gaddar Daughter : ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ (రిజర్వుడు) స్థానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల రెండోవారంలో ఏఐసీసీ వెలువరించనున్న లిస్టులో వెన్నెల పేరు ఉంటుందని అంటున్నారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి స్వయంగా గద్దర్ నివాసానికి వెళ్లి వెన్నెలకు తెలియజేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యంతో ఈ విషయాన్ని మధుయాష్కి చర్చించినట్లు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ గతంలోనే వచ్చింది. గద్దర్ కుమారుడు సూర్యానికి టికెట్ ఇవ్వాలా ? కుమార్తె వెన్నెలకు టికెట్ ఇవ్వాలా ? అనే దానిపై సుదీర్ఘ మేధోమథనం చేసిన తర్వాత వెన్నెలకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లతో మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి నుంచే ఆ దిశగా మహిళా నాయకత్వాన్ని పెంచాలనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకుపోతోందని సమాచారం. తద్వారా భవిష్యత్తులో పోటీ చేయడానికి సమర్ధులైన మహిళా నేతల లోటు ఉండదని హస్తం పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈక్రమంలోనే గద్దర్ కుమార్తె వెన్నెలకు అవకాశాన్ని కల్పించాలని డిసైడ్ చేశారని తెలుస్తోంది. వెన్నెల చక్కగా ఉపన్యాసాలు ఇవ్వగలరు. పాటలు పాడగలరు. గద్దర్ కుమార్తెకు టికెట్ ఇస్తే.. గద్దర్ పై ఉన్న సానుభూతి పవనాలు సులభంగా ఓట్లుగా మారి కాంగ్రెస్ కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో విజయాన్ని అందిస్తాయనే ఆశాభావంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.