Flood Threat : నీట మునిగిన వెంకటాద్రి పంప్‌హౌస్.. హుస్సేన్ సాగర్‌కూ వరదపోటు
పంప్ హౌస్ లోపల ఉన్న యంత్రాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
- By Pasha Published Date - 10:36 AM, Tue - 3 September 24
Flood Threat : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలోనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వరద ముంచెత్తింది. ప్రాజెక్టులో భాగమైన వెంకటాద్రి పంప్ హౌస్ వరదలో మునిగింది. 34 కిలోమీటర్ల పరిధిలో టన్నెల్‌లోకి వరద నీరు చేరింది. దీంతో పంప్ హౌస్ లోపల ఉన్న యంత్రాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. వరదల(Flood Threat) వల్ల ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
- హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌కు కూడా వరద కొనసాగుతోంది. ప్రధానంగా బంజారా, పికేట్, కూకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వాటర్ ఇన్ ఫ్లో 2307 క్యూసెక్కులు, వాటర్ ఔట్ ఫ్లో 1751 క్యూసెక్కులు ఉంది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8,52,240 క్యూసెక్కులు.
- అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 66 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,92,543 క్యూసెక్కులు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. 46433 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. మానేరు, మూలవాగు నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు మరో 37180 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
- మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,25,920 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో 3,25,029 క్యూ సెక్కులు ఉంది. ప్రస్తుతం 1042.323 ఫీట్ల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తి పోతల పథకాలకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.