నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?
నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి
- Author : Sudheer
Date : 07-02-2026 - 5:28 IST
Published By : Hashtagu Telugu Desk
Fire Breaks Out at Hyderabad Forensic Lab : నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసు, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరియు BRS ఎమ్మెల్యేల కొనుగోలు (ఎమ్మెల్యేల ఎర) ఆపరేషన్‌కు సంబంధించిన కీలక సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు ఈ గదిలోనే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు సిద్ధమవుతున్న తరుణంలోనే మంటలు చెలరేగడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ కీలక ఫైల్స్ అన్నీ బూడిదయ్యాయని వస్తున్న వార్తలు దర్యాప్తు సంస్థలను ఆందోళనలో పడేశాయి.
ప్రభుత్వ యంత్రాంగంపై ఆరోపణలు
కేవలం రాజకీయ కేసులే కాకుండా, కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల (ACB) కేసుల ఫైల్స్ కూడా ఇదే ప్రమాదంలో కాలిపోయాయని తెలుస్తోంది. అధికార పార్టీకి లేదా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఇబ్బందికరంగా మారిన సాక్ష్యాలను మాయం చేసేందుకే ఈ “ప్లాన్డ్ ఆక్సిడెంట్” జరిగి ఉండవచ్చని ప్రతిపక్షాలు మరియు కొందరు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అత్యంత భద్రత ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరగడం, అది కూడా కీలక ఫైల్స్ ఉన్న గదిలోనే మంటలు వ్యాపించడం యాధృచ్చికం కాకపోవచ్చనేది ప్రధాన వాదన.
సాధారణంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో డేటా బ్యాకప్ వ్యవస్థలు ఉంటాయి. అయితే, ఫిజికల్ ఎవిడెన్స్ (వస్తురూప ఆధారాలు) మరియు ఒరిజినల్ హార్డ్ డిస్క్‌లు దెబ్బతింటే కేసుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఇది కావాలని చేసిన కుట్రనా లేక షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపమా అనేది ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒకవేళ ఆధారాలు మాయం చేయడానికే ఈ పని చేసి ఉంటే, అది న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడమే అవుతుంది.