Etela Rajender: కేసీఆర్ బలం, బలహీనత తెలిసినోడ్ని.. హైకమాండ్ శభాష్ అనేలా కలిసి పనిచేస్తాం..
తెలంగాణలో గెలిస్తే బీజేపీ లేదంటే బీఆర్ఎస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు.
- By News Desk Published Date - 09:26 PM, Tue - 4 July 23

తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కి అప్పగిస్తూ కేంద్ర పార్టీ అధిష్టానం ప్రకటించింది. బండి సంజయ్ (bandi sanjay) ను ఆ పదవి నుంచి తొలగించింది. అయితే సంజయ్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అతికొద్దికాలంలోనే బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగుర వేయాలని నేషనల్ ఎక్జిక్యూటివ్ మీటింగ్‌లోనే అంకురార్పణ చేశారని ఈటల అన్నారు. దుబ్బాక, జీహెచ్ ఎంసీ, హుజురాబాద్ అసెంబ్లీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకూడా బీజేపీ విజయం సాధించిందని ఈటల గుర్తు చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచామని అన్నారు. తెలంగాణలో గెలిస్తే బీజేపీ లేదంటే BRS గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదని అన్నారు. బీఆర్ ఎస్‌ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని ఈటల అన్నారు.
ప్రజలు మా వెంటే ఉన్నారన్న ఈటల.. బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం జరుగుతుందని, అదే బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం జరుగుతుందని అన్నారు. దేశానికి ఒక OBC ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ అని అన్నారు. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటామని ఈటల చెప్పారు. సహచర నాయకులు, కార్యకర్తలు అందరికీ అండగా ఉంటామని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థి నాయకులుగా పని చేశారు. ఎమ్మెల్యే గా పనిచేశారు. ఆయనకు రాజకీయంగా అపార అనుభవం ఉందని ఈటల కొనియాడారు. నూతన అధ్యక్షుడిగా నియామకం అయిన కిషన్‌రెడ్డితో కలిసి పార్టీకి మచ్చతేకుండా హైకమాండ్ శభాష్ అనే విధంగా పని చేస్తామని ఈటల చెప్పారు.