Hydraa : పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు – ఈటెల
Hydraa : గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు
- By Sudheer Published Date - 02:57 PM, Fri - 27 September 24

పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etela Rajender). మూసీ (Musi) ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తూ అక్రమ ఇళ్లను గుర్తిస్తున్నారు. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడితున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టారు.
అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్ మండలాలు, మేడ్చల్‌లో ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెంట్, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో కూల్చివేసే నిర్మాణాలను మార్క్ చేశారు. మూసీ నది వెంబడి రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో రివర్ బెడ్(నది గర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్‌లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. హైదరాబాద్‌లో అధికారులు అంచనా వేసుకున్న 1595 నిర్మాణాల్లో నిరసనల మధ్య 941 ఇండ్లకు మాత్రమే మార్క్ చేశారు. నేడూ కూడా సర్వే కొనసాగనున్నది. తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు ప్రతిచోటా కనిపించాయి. ఉప్పల్‌లో కేసీఆర్ నగర్, చైతన్యపురిలో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.
ఇక బాధితులకు బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతుగా నిలిచారు. తము ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని.. ఇప్పుడు వచ్చి కూల్చేసి ఎక్కడో ఇళ్లు ఇస్తామని చెబుతున్నారని ఈటలకు వివరించారు. తమకు ఇక్కడ ఉపాధి ఉందని.. ఇతర ప్రాంతాలకు వెళ్తే తమ ఉపాధి దెబ్బ తింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈటల స్పందించారు. పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహిస్తున్నారని అన్నారు. కూల్చివేతలతో చాలా మంది ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు. లేకుంటే ప్రజల మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోపక్క లంగర్‌హౌస్‌లోని డిఫెన్స్ కాలనీ వాసులు రింగు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు వనస్థలిపురం రైతుబజార్‌లో చిరువ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లాచెదురుచేసి తొక్కించారు. ఇలా ఎక్కడ చూడు హైదరాబాద్ మొత్తం నిరసనలు , ఆందోళనలతో ఊగిపోతోంది.
Read Also : Kunki Elephants : ఏపీ-కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్