Telangana Polls: తెలంగాణాలో ఎన్నికల సంఘం దూకుడు
తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమగ్ర శిక్షణా తరగతులు ప్రారంభించింది
- Author : Praveen Aluthuru
Date : 17-07-2023 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Polls: తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమగ్ర శిక్షణా తరగతులు ప్రారంభించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 34,891 మంది బూత్ స్థాయి అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణా సమావేశం నిర్వహించారు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
తెలంగాణాలో నిర్వహించబోయే ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పక్షపాతం చూపించకుండా నిష్పక్షపాతంగా పోలింగ్ జరగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
నిజానికి ఎన్నికల వేళ బూత్ స్థాయి అధికారులదే కీలక పాత్ర. రిగ్గింగ్ జరగాలన్నా, దొంగఓట్లు వేసే ప్రక్రియను అడ్డుకోవాలన్న వారే కీలకం. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూలై 18న అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. అనంతరం జిల్లాల వారీగా జూలై 19 నుండి జూలై 25 వరకు శిక్షణా సమావేశాలు నిర్వహించి అధికారులకు తరగతులు సిద్ధం చేసింది.