Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత
Inspections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికల వేళలో చురుగ్గా జరుగుతున్న పోలీసులు తనిఖీలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- By Sudheer Published Date - 07:10 PM, Fri - 7 November 25
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికల వేళలో చురుగ్గా జరుగుతున్న పోలీసులు తనిఖీలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మోతీనగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ నివాసాలపై పోలీసులు సడన్ సెర్చ్‌లు నిర్వహించారు. ఈ చర్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు ద్వారా బీఆర్ఎస్ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.
Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
ఈ తనిఖీల సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి, పోలీసు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. “మేము నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నాం” అని పోలీసులు వివరణ ఇచ్చినా, జనార్ధన్ రెడ్డి దానిని రాజకీయ పర్యవసానంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఇది పోలీసులు చేసే సాధారణ డ్యూటీ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలపై జరిగే ప్రతీకార చర్య. పోలీసులు INC తొత్తులుగా మారిపోయారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు” అని తీవ్రంగా విమర్శించారు. ఆయన ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీఆర్ఎస్ నేతలు ఈ సంఘటనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. “జనరల్ ఎలక్షన్ సమయాల్లో ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, పోలీసులు మాత్రం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అక్రమ నగదు, మద్యం, మరియు ఇతర ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన వస్తువులపై తనిఖీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం దీనిని రాజకీయ వేధింపుల భాగంగా చూస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారి, ఎన్నికల ముందస్తు వేడి తారాస్థాయికి చేరింది.