Drunk Man : తాగిన మత్తులో ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన మందుబాబు
Drunk Man : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, ఫ్లైఓవర్ మీద నుంచి నేరుగా కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. అంత ఎత్తు నుంచి దూకడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే
- By Sudheer Published Date - 09:53 PM, Mon - 21 April 25

హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద ఫ్లైఓవర్‌పై నుంచి ఓ మందుబాబు (Drunk Man) దూకిన ఘటన ఆదివారం మధ్యాహ్నం సంచలనం కలిగించింది. పిల్లర్ నంబర్ 100 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, ఫ్లైఓవర్ మీద నుంచి నేరుగా కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. అంత ఎత్తు నుంచి దూకడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే అయినా, ఆ వ్యక్తి ధైర్యానికి భయపడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే అదృష్టవశాత్తు, అక్కడ ఉన్న బలమైన విద్యుత్ తీగలు అతన్ని ఆపడంతో, అతను వాటికి వేలాడుతూ గబ్బిలంలా కనిపించాడు.
ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన స్థానికులు, తనని రక్షించేందుకు ముందుకు వచ్చారు. తక్షణమే స్పందించిన వారు, పక్కనే ఉన్న కారు బాడీ కవర్‌ను తీసుకొని దానిని ఓ వలలా ఉపయోగించడానికి సిద్ధమయ్యారు. పది నుండి పదిహేను మంది కలిసి కవర్‌ను గట్టిగా పట్టుకొని, మందుబాబును ధైర్యం చెబుతూ.. దూకమని ప్రోత్సహించారు. చివరికి ఆ వ్యక్తి వైర్లను వదిలి కారు కవర్‌లోకి దూకాడు. ఎత్తు ఎక్కువగా ఉండటంతో కవర్ కొద్దిగా చినిగిపోయింది కానీ, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్ది గాయాలతో సురక్షితంగా బయటపడటమే ఒక చిన్న అద్భుతంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అక్కడున్న కొంతమంది యువత తమ ఫోన్లలో రికార్డు చేయగా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై విచిత్రమైన కామెంట్లు చేస్తూ, స్థానికులను నిజమైన హీరోలుగా కొనియాడుతున్నారు. “కారు కవర్ దేవుడిలా కాపాడింది” అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
A Drunk man narrowly escaped death after falling from the PVNR Expressway at Attapur @TheSiasatDaily #Hyderabad pic.twitter.com/ruiDXkRe3v
— Mohammed Baleegh (@MohammedBaleeg2) April 21, 2025