Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?
Farmhouse Liquor Party: మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
- Author : Sudheer
Date : 12-12-2025 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు పార్టీ కల్చర్‌కు వేదికగా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, సరైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహించడం సాధారణమైపోయింది. ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ పార్టీలను భగ్నం చేస్తున్నారు. తాజాగా మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పార్టీని నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన సమాచారం మేరకు.. గురువారం రాత్రి ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతి లేకుండా అక్రమంగా వినియోగిస్తున్న మద్యం బాటిళ్లతో పాటు హుక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పార్టీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిపి మొత్తం 29 మంది ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం పార్టీ నిర్వహించినందుకు గాను పోలీసులు 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో పెరుగుతున్న అక్రమ పార్టీల నిర్వహణపై పోలీసులు పటిష్ట నిఘా ఉంచారనేందుకు ఈ రైడ్ నిదర్శనం.
Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ నిర్వహణకు అనుమతులు లేకపోవడంతో, పోలీసులు ఎక్సైజ్ చట్టంలోని 223 మరియు 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ పార్టీని నిర్వహించిన పార్థసారథి మరియు ఫామ్‌హౌస్ యజమాని సుభాష్‌లపై ప్రధానంగా కేసులు నమోదు చేశారు. రాజకీయ నాయకులు భాగస్వాములైన ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులు ఎవరు, ఈ పార్టీ వెనుక మరేదైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ఈ ఘటన ద్వారా పోలీసులు స్పష్టం చేశారు.
అయితే ఫామ్ హౌస్ పార్టీకి తమకు సంబంధం లేదని MLC దువ్వాడ శ్రీను, మాధురి తెలిపారు. ‘మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పిలిస్తే అక్కడికి వెళ్లాం. బిజినెస్ మీట్ పెడుతున్నాం రమ్మని అడిగారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా ఉందని మాకు తెలియదు’ అని శ్రీను మీడియాకు చెప్పారు. ‘నాకు హుక్కా అంటే ఏంటో కూడా తెలియదు. పోలీసులు చెప్పాకే ఆ పార్టీకి పర్మిషన్ లేదని తెలిసింది. నేను అరెస్ట్ కాలేదు. ఇంట్లోనే ఉన్నా’ అని మాధురి వివరించారు.