Indiramma Houses : స్థలం లేకున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు – మంత్రి పొంగులేటి
Indiramma Houses : ఇందిరమ్మ హౌసింగ్ పథకంలో అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటికే నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆగస్టు 15వ తేదీలోగా కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశించారు
- Author : Sudheer
Date : 26-07-2025 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి సొంత ఇంటి నిర్మాణాలతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇండ్ల స్థలాలు (Indiramma Houses ) లేని వారు కూడా ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులవుతారని ప్రకటించారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకంలో అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటికే నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆగస్టు 15వ తేదీలోగా కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. అర్హుల ఎంపికను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం కూడా అందించనుంది. అర్హులైన లబ్దిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి ప్రకటించారు. పాత దరఖాస్తులు అయినా, తాజా దరఖాస్తులు అయినా వాటిని పరిశీలించి, ఎవరికైతే అర్హులో వారికీ ఇళ్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ పథకం క్రింద నిరుపేదలకు న్యాయం జరగాలని, దీని అమలు క్రమంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక సరఫరా, చెల్లింపులు, లబ్దిదారుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. శ్రావణ మాసం సందర్భంగా త్వరలో గృహ ప్రవేశాల నిర్వహణకు సన్నాహాలు జరగనున్నట్లు తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, సందేహాలకు పరిష్కారం కోసం హైదరాబాద్ హౌసింగ్ కార్యాలయంలో త్వరలో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు మరింత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా తెలంగాణ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ఎంఎల్ఏలతో కలిపి నిర్వహించాలని సూచించారు. అలాగే, వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని ఉమ్మడి వరంగల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి పేర్కొన్నారు.