Revanth Reddy : రేవంత్ ఇంటికి డీకే శివకుమార్.. డీజీపీ అంజనీకుమార్ !
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు ఇప్పుడు అందరి చూపు ఉంది.
- Author : Pasha
Date : 03-12-2023 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు ఇప్పుడు అందరి చూపు ఉంది. హైదరాబాద్‌లో గాంధీ భవన్ ముందుకు కాంగ్రెస్ క్యాడర్ చేరుకొని సంబురాలు మొదలుపెట్టారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి ముందు అభిమానులు స్వీట్లు పంచి, బాణసంచా పేల్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. గాంధీ భవన్‌కు కాకుండా నేరుగా రేవంత్ ఇంటికి డీకే శివకుమార్ బయలుదేరడం గమనార్హం. దీన్నిబట్టి తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ సర్కారులో రేవంత్‌కు ఇవ్వబోయే ప్రయారిటీని అర్థం చేసుకోవచ్చు. రేవంత్ శ్రమ ఫలించింది అనే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది అనేందుకు ఈ పరిణామాలను సంకేతంగా చెప్పొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు రేవంత్ ఇంటి వద్ద మునుపటి కంటే పోలీసులు భద్రతను పెంచారు. ఇంతకుముందు కంటే ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రేవంత్ ఇంటికి డీజీపీ అంజనీకుమార్ కూడా చేరుకొని.. ఆయనతో భేటీ అయ్యారు. కాసేపట్లో గాంధీ భవన్‌కు రేవంత్ బయలుదేరి వెళ్లనున్నారని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డి స్థానంలో రేవంత్ లీడ్ లో ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక తన సొంత స్థానం కొడంగల్‌లోనూ రేవంత్ పూర్తి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 65 స్థానాల్లో కాంగ్రెస్, 37 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌లో(Revanth Reddy) ఉన్నాయి.