Devotees fume: మేడారం జాతరకు ‘‘వీఐపీల’’ తాకిడి!
మేడారం జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మకసారలమ్మ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుములాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ జాతర కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు,
- By Balu J Published Date - 04:23 PM, Thu - 10 February 22

మేడారం జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మకసారలమ్మ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుములాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ జాతర కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు వీఐపీల తాకిడి ఎక్కువైనట్టు సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా ప్రముఖుల తాకిడి పెరిగిందనీ, దర్శననానికి వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఖరీదైన కార్లను చూడగానే పోలీసులు ఎల్లప్పుడూ బారికేడ్లను తెరవడానికి సిద్ధంగా ఉంటున్నారని, వైట్ అంట్ వైట్ డ్రస్సింగ్, బ్రాస్ లెట్ ధరించి కనిపిస్తే చాలు వెంటనే ఆహ్వానం పలుకుతున్నారు. ప్రముఖులు, అతని కుటుంబ సభ్యులను నేరుగా ఆలయంలోకి అనుమతించినప్పుడు మేం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గంటల తరబడి క్యూ లైన్లలోనే ఉంటున్నామని’’ అని గత ఆరేళ్లుగా జాతరలో పాల్గొంటున్న హైదరాబాద్‌కు చెందిన క్రాంతి అనే భక్తుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ‘వీఐపీల రాకతో పలువురు భక్తులు మండిపడుతున్నారు. అయితే సమ్మక్క, సారక్కల పవిత్ర వేదికల (గద్దెలు) ఆవరణలోకి వీఐపీలను మాత్రమే అనుమతించేందుకు తగిన విధానాలను అనుసరిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే మంగళవారం జరిగిన ఒక షాకింగ్ సంఘటన భక్తుల వాదనలకు విరుద్ధంగా ఉంది.
మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పుణ్యక్షేత్రం వద్దకు వస్తున్న సమయంలో.. కొత్తగా నియమితులైన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ తన కుటుంబసభ్యులను, బంధువులను అనుమతించిన తర్వాత గేటుకు తాళం వేశారు. “ఆమె వైఖరికి మేం షాక్ అయ్యాం. నేను కూడా ఒక అధికారినే అని ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు” అని ఒక స్థానిక అధికారి మీడియాకు తెలిపారు. అంతేకాదు.. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఇటీవల ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. “కొత్తగా రిక్రూట్ అయిన ఎస్‌ఐలపై ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ-పోలీసింగ్ విధానం లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి” అని ఒక పోలీసు అధికారి అంగీకరించారు. అయితే విశ్రాంతి లేకుండా పని చేసే పోలీసులు అసహనానికి గురైన సందర్భాలు ఉండవచ్చని ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. అయితే భక్తులకు సాఫీగా దర్శనం కల్పించడానికి ప్రయత్నిస్తాం” అన్నారాయన.