TSRTC : పండగ వస్తే చాలు ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు – హరీష్ రావు
TSRTC : “బతుకమ్మ, దసరా వేడుకల సమయంలో ఆత్మీయతను పంచుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం మాత్రం ముక్కు పిండి ఛార్జీలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదేనా ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరి?” అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 04:00 PM, Fri - 19 September 25

తెలంగాణలో దసరా (Dasara) పండుగ సందర్బంగా ప్రజలు ఊళ్లకు చేరుకునే సమయానికి బస్సు ఛార్జీలను (BUS Ticket Charges Hike) పెంచిన ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతోంది. ముఖ్యంగా దసరా స్పెషల్ బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు విధించడం పట్ల బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ..“పండుగల సమయంలో ప్రజల సౌకర్యం కోసం అదనపు సర్వీసులు నడపాలి కానీ, వారి జేబులు ఖాళీ చేయడం ప్రజాపాలన కాదు” అని మండిపడ్డారు.
Maruti Suzuki Cars: కొత్త జీఎస్టీతో మారుతి కార్ల ధరలు భారీగా తగ్గాయి!
పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సులపై కూడా ధరలు విపరీతంగా పెంచడాన్ని తప్పుబట్టారు. “అదనపు సర్వీసుల పేరిట 50 శాతం అదనంగా వసూలు చేయడం దోపిడీ తప్ప మరేమీ కాదు. పండుగ సమయాల్లో ప్రజలు ఇంటివద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవాలని ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో రవాణా ఖర్చులు పెంచి వారిపై ఆర్థిక భారం మోపడం చాలా దుర్మార్గమైన చర్య” అని అన్నారు.
ప్రజలకు పండుగలు ఆనందాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఈ నిర్ణయంతో అసలు పండుగ వాతావరణాన్నే చెడగొడుతోందని ఆయన విమర్శించారు. “బతుకమ్మ, దసరా వేడుకల సమయంలో ఆత్మీయతను పంచుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం మాత్రం ముక్కు పిండి ఛార్జీలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదేనా ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరి?” అని ప్రశ్నించారు. మొత్తం మీద పండుగల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సింది పోయి, వారి పరిస్థితిని మరింత కష్టతరం చేయడం సరికాదని హరీశ్ రావు అన్నారు.