Srushti Case: డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయిలు
Srushti Case: రాజస్థాన్ దంపతులు మొదలుపెట్టిన ఈ కేసులో తాజాగా మరో ఐదుగురు బాధితులు కూడా తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు
- By Sudheer Published Date - 09:31 AM, Wed - 6 August 25

సరోగసీ పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srishti Fertility Center) చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజస్థాన్ దంపతులు మొదలుపెట్టిన ఈ కేసులో తాజాగా మరో ఐదుగురు బాధితులు కూడా తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసాలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వారికి, ఎన్నారైలకు కూడా విస్తరించినట్లు విచారణలో తేలింది. గోపాలపురం పోలీసులు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించగా, ఆమె సహకరించడం లేదని సమాచారం. కస్టడీ గడువు నేటితో ముగియనుండటంతో, మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు కస్టడీ పొడిగింపు కోరనున్నారు.
ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మరో డాక్టర్ విజ్జులత ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నమ్రత నిర్వాకాలకు సహకరించిన డాక్టర్ విజ్జులత విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించగా, శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనుమతులు విజ్జులత పేరుతో ఉన్నాయని విచారణలో తేలడంతో, సరోగసీ మోసాలకు ఆమె కూడా బాధ్యురాలని పోలీసులు నిర్ధారించారు. నమ్రత, విజ్జులత ఇద్దరూ కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Sanjeevini : ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు
పోలీసుల దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం బ్యాంక్ లావాదేవీలు. డాక్టర్ నమ్రత, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. 2019 నుంచి 2025 మధ్యకాలంలో ఈ ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సరోగసీ కోసం వచ్చే దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, ఈ మొత్తాలను వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన తీరు కూడా విచారణలో బయటపడింది. నల్గొండకు చెందిన దంపతుల నుంచి రూ. 11 లక్షలు, ఒక ఎన్నారై నుంచి రూ.19 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన మరో జంట నుంచి రూ.16.5 లక్షలు, ఇంకో జంట నుంచి రూ.12.5 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పిల్లలు లేని దంపతులను మాయమాటలతో నమ్మించి, సరోగసీకి బదులుగా ఐవీఎఫ్ పద్ధతి అంటూ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తేలింది. ప్రస్తుతం డాక్టర్ నమ్రతతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని పోలీసులు వేర్వేరుగా విచారిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసులు ఇప్పటికే తనిఖీలు చేసి కీలక ఆధారాలు సేకరించారు.
President of CAB : మరోసారి CAB అధ్యక్షుడిగా గంగూలీ?