Shooting Incident : మలక్ పేటలో సీపీఐ లీడర్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు
Shooting Incident : చందు నాయక్(CPI leader Chandu Nayak)పై గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు
- By Sudheer Published Date - 10:53 AM, Tue - 15 July 25

హైదరాబాద్ నగరంలో మలక్‌పేట శాలివాహన నగర్ పార్కు(Shalivahana Nagar Park)లో మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల (Shot ) ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఉదయం రోజువారీగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వామపక్ష నాయకుడు చందు నాయక్(CPI leader Chandu Nayak)పై గుర్తుతెలియని దుండగులు అతి సమీపం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చందు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికుల మధ్య భయాందోళన నెలకొంది.
చందు నాయక్ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మలక్‌పేట పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పార్క్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఘటనా స్థలంగా గుర్తించి అక్కడే ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన సమయంలో పార్కులో వున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దుండగుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు పోలీసులు తెలిపారు.
Gujarat High Court : టాయిలెట్ సీట్‌పై కూర్చొని వర్చువల్ కోర్ట్‌కు హాజరైన వక్తికి భారీ జరిమానా
మృతుడు చందు నాయక్ సిపిఐ (CPI) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చందు నాయక్ రాజకీయంగా వామపక్ష భావజాలానికి తగినట్లుగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేవారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి నాయకుడిపై జరిపిన దాడికి రాజకీయ కారణాలున్నాయా లేదా వ్యక్తిగత ద్వేషాలపై ఇది జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదివరకు చందు నాయక్‌కు ఏమైనా ప్రాణహానీ బెదిరింపులు వచ్చాయా? లేదా ఇటీవల ఆయన పాల్గొన్న ఉద్యమాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఉదంతం తాలూకు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మలక్‌పేట పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రజల భద్రత కోసం పార్క్ ప్రాంతంలో క్షణక్షణం పోలీసు నిఘా కొనసాగుతోంది.