Telangana Vs Tamil Nadu : రూ.1000 కోట్ల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన తమిళనాడు
Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది.
- By Pasha Published Date - 03:12 PM, Tue - 12 December 23

Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది. తమిళనాడుకు ఆ పెట్టుబడిని మళ్లించింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో పిల్లైపక్కం ప్రాంతంలో 25 ఎకరాల్లో గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు రెడీ అయింది. జనవరిలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ వేదికగా తమిళనాడు ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఎంఓయూపై సంతకాలు చేస్తుందని తెలుస్తోంది. యాపిల్ కంపెనీకి సైతం ఫోన్ స్క్రీన్ గ్లాస్‌ను సప్లై చేసే కార్నింగ్ సంస్థ భారీ పెట్టుబడి ప్రతిపాదనను తెలంగాణ నుంచి తమిళనాడుకు డైవర్ట్ చేయడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
కార్నింగ్ కంపెనీ దేశంలో తొలిసారిగా తెలంగాణలో రూ.934 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 800 మందికి ఉపాధి లభిస్తుందని ఆనాడు వెల్లడించారు. ఇప్పుడు ఆ కంపెనీని తమిళనాడు ఎగరేసుకుపోయింది. దీంతో తెలంగాణలో దాదాపు 800 మందికి ఉపాధి లభించే ఛాన్స్ గల్లంతైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ మెరుగ్గా ఉండటంతోపాటు.. ఇతర ఆపిల్ సప్లయర్లు కూడా చేరువగా ఉంటారనే కారణంతో తాము తమిళనాడు వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని కార్నింగ్ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో ఇప్పటికే యాపిల్ కంపెనీ ప్రొడక్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి తన భారత భాగస్వామి అయిన ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్‌తో కలిసి గొరిల్లా గ్లాస్‌లను ఉత్పత్తిని కార్నింగ్ ప్రారంభించనుంది. తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదంతం(Telangana Vs Tamil Nadu) చెబుతోంది.