CM KCR: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర: సీఎం కేసీఆర్!!
తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్లే తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని సీఎం కేసీఆర్ అన్నారు.
- By Hashtag U Published Date - 09:38 PM, Tue - 12 April 22

తెలంగాణ సర్కార్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్లే తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని సీఎం కేసీఆర్ అన్నారు. తమ చర్యల వల్లే కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. అందుకే పంటలు బాగా పండుతున్నాయన్నారు. అయితే కేంద్రంలో పూర్తిస్థాయిలో రైతు వ్యతిరేక సర్కార్ ఉందని..ఇది భారత రైతాంగ దురదృష్టమన్నారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగిందన్నారు. చివరికి దిగివచ్చిన కేంద్రం…ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు.
ఇంత దరిద్రపు గొట్టు, దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘట్టాలన్నింటికీ దేశ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని తెలిపారు. అదంతా ఓ చరిత్రగా చెప్పారు. ఉద్యమాలు చేస్తున్న సమయంలో రైతులను మోదీ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని..ఉగ్రవాదులుగా అభివర్ణించారని కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలోని వ్యవసాయరంగాన్ని మొత్తం కూడా కార్పొరేటర్లకు అప్పగించాలన్న ఓ బలమైన కుట్ర జరుగుతోందని..ఆ కుట్ర కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని…దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చించిందని..అయినా దానిని అమలు చేయరని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వీటన్నింటితోపాటు ఎరువుల ధరలు కూడా పెంచారని ఫైర్ అయ్యారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో తమకు అవసరమైన బిల్లులను పాస్ చేయించున్నారో తప్పా…రైతులకు అవసరమైన వాటిని మాత్రం పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.