Cong Ghar Wapsi: రేవంత్ ‘‘కాంగ్రెస్ ఘర్ వాపసీ’’ లక్ష్యం నెరవేరేనా?
కాంగ్రెస్ పార్టీ వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు. దాని కోసం ఘర్ వాపసీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే కాంగ్రెస్ తీసుకున్న ఆ మిషన్ కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
- By Siddartha Kallepelly Published Date - 10:19 PM, Thu - 20 January 22

కాంగ్రెస్ పార్టీ వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు. దాని కోసం ఘర్ వాపసీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే కాంగ్రెస్ తీసుకున్న ఆ మిషన్ కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు మళ్ళీ సొంత గూటికి వద్దామంటే కొన్ని చోట్ల సీనియర్లు, మరికొన్ని చోట్ల ఆయా జిల్లాల నేతలు అడ్డుపడుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీలో కీలకమైన చేరకలు ఆగిపోతున్నాయి.
నాలుగు నెలల క్రితం పలువురు రాజకీయ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి పీసీసీ చీఫ్ రేవంత్ ను కలిశారు. అందులో ఉమ్మడి మహాబూబ్ నగర్ కి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, నిజామాబాద్ జిల్లా నుండి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, భూపాల పల్లి నుండి గండ్ర సత్యనారయణ తదితరులు రేవంత్ ని కలిశారు. వీరిలో ఎర్రశేఖర్, సంజయ్ లపై నేర చరిత్ర వుందని కొందరు సీనియర్లు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఇక ఆయా జిల్లాలకు చెందిన సొంత పార్టీ నేతలు కూడా అడ్డుపడడంతో వారి ఎంట్రీ ఆగిపోయింది. ఇక గండ్ర సత్యనారాయణకు సైతం కొండ దంపతులు అడ్డుపడ్డారు. అయితే రేవంత్ ఇన్వాల్ కావడంతో గండ్ర కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు వుండడం లేదని అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఆరోపణలు చేసి వైఎస్ఆర్టీపీ లోకి వెళ్లిన ఇందిరా శోభన్ కూడా తిరిగి పార్టీలోకి రావడానికి సీరియస్ గా ట్రై చేసింది. కానీ కొందరు నేతలు ఇందిరా శోభన్ కు అడ్డుపడడంతో తాను ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్లింది. తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు చెరుకు సుధాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని సమాచారం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అడ్డుపడడంతో ఆయన చేరికకు బ్రేక్ పడింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమున్న నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దంగా వున్నారు. ఆయన స్థాపించిన యువ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకున్నారు. కానీ ఆ జిల్లాకు చెందిన సీనియర్లే చేయి అడ్డుపెట్టడంతో ఆయన ఎంట్రీ కూడా ఆగుతోంది. ఇలా చాలామంది ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ చూపుతున్నా, తమ పార్టీకే చెందిన కొందరు సీనియర్లు అడ్డుపడడంతోనే వారి ఎంట్రీ ఆగుతోందనే ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టికేట్ ఆశించి దక్కకపోవడంతో పార్టీ వీడి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయిన హర్షవర్ధన్ రేవంత్ పీసీసీ చీఫ్అయ్యాక మళ్లీ పార్టీలోకి రావడానికి ట్రై చేశారు. అయితే ఆయనకు కూడా కొందరు నేతలు అడ్డుపడ్డారు. చివరికి రేవంత్ వాళ్ళకి సర్థిచెప్పడంతో హార్షవర్ధన్ రెడ్డి పార్టీలోకి వెళ్లగలిగారు. మాజీ పీసీసీ చీఫ్, రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ తిరిగి హాస్తం గూటికి వద్దామనుకున్నప్పుడు చాలామంది అపోజ్ చేశారు.
రాహుల్ గాంధీ కూడా డీఎస్ చేరికకు అడ్డుపడ్డా సోనియా చొరవతో డీఎస్ రీఎంట్రీ సాధ్యమంది.
కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ మిషన్ టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి వేరే పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులను మళ్ళీ పార్టీలోకి తేవాలని అనుకున్నా, ఆ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. సొంత పార్టీ నేతలే చేయి అడ్డు పెట్టడంతో పార్టీలో చేరడానికి ముందుకొచ్చే నేతలు ఆలోచనలో పడుతున్నారట. హాస్తం పార్టీలో నేతలు ఐక్యతతో పిలిస్తే కాంగ్రెస్ లోకి వెళ్దాం, లేకుంటే కమలం గూటికి వెళ్తామనే ఆలోచన చేస్తున్నారట.