CM Revanth Wyra Public Meeting : హరీష్ నీకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయి – సీఎం రేవంత్
తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిందని, హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు
- By Sudheer Published Date - 09:05 PM, Thu - 15 August 24

ఖమ్మం జిల్లా వాసులు ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టును గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Inaugurated Sitarama Project Pump House) ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను రేవంత్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. ఈ సందర్బంగా వైరా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ (Wyra Public Meeting)లో పాల్గొని..బిఆర్ఎస్ పార్టీ పై, మాజీ సీఎం కేసీఆర్ , హరీష్ రావు లపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరు ఇవ్వలేదని , ఆరు నెలలు తాము చిత్తశుద్ధితో పనిచేస్తే నేడు ప్రాజెక్టు తొలిదశ పూర్తయిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు కోసం తాము పడిన శ్రమను మాజీ మంత్రి హరీష్‌రావు చులకన చేసి మాట్లాడుతున్నారని, నిజంగా వారికి దీనిపై చిత్తశుద్ధి ఉండుంటే ఏడేళ్లలో ఎందుకు దీనిని పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. తాము నిర్మించిన ప్రాజెక్టు నీళ్లను కాంగ్రెస్ నేతలు నెత్తిన చల్లుకుంటున్నారని హరీష్ రావు మాటలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
హరీష్ రావు దూలంలాగా పెరిగారు కానీ బుద్ధి పెరగలేదని , రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాల పెంపు, ముందుగానే పంప్ మోటార్లు పెట్టటం, నాలుగేళ్లుగా పంప్ హౌస్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవటం ఏంటని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్ట్‌పై మామా అల్లుళ్లు బోగస్ మాటలు చెబుతున్నారని.. తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నదని, ఇక.. కేసీఆర్, హరీష్‌రావు చెల్లని రూపాయిలేనని సీఎం ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిందని, హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు.
హరీష్ రావు నీకు సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయి.. లేకుంటే ఏట్ల దునికి సావు – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/iCQuXRpBUn
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2024