Group 1 Exams : ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గ్రూప్-1 పరీక్షలు ఆగవు – సీఎం రేవంత్
Group 1 Exams : పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి
- By Sudheer Published Date - 08:33 PM, Sat - 19 October 24

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (Group-1 Mains Exams) ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. గ్రూప్-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ అశోక్ నగర్ (Ashok Nagar) లో అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజులుగా వారంతా ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు ఏకంగా చలో సచివాలయం పిలుపునిచ్చారు. అభ్యర్థుల వెంట బిజెపి , బిఆర్ఎస్ కూడా జతకట్టింది. ఈ క్రమంలో పోలీసులు బిజెపి నేతలతో పాటు బిఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
మరోపక్క హరీష్ రావు సైతం..’గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా..? అని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇలా ప్రతిపక్షాల డిమాండ్స్ , అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ GO 29 తో పాటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై స్పందించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం’ అని పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం చెప్పుకొచ్చారు.
పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని గుర్తు చేసారు. తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని BRS పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని కోరడం జరిగింది. అలాగే జీవో 29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదనపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. ‘గ్రూప్-1 నోటిఫికేషన్ తో పాటు జీవో 29 ఇచ్చాం. రిజర్వేషన్లు, ఖాళీల భర్తీలో 1 పోస్టుకు 50 మందిని పిలవాలని నిర్ణయించాం. 563 గ్రూప్-1 పోస్టులకు మెయిన్స్ కోసం ఇలానే ఎంపిక చేశాం. ప్రిలిమ్స్ అయ్యాక కొందరు 1:100 పిలవాలని అంటున్నారు. ఆ రోజే దీనిపై ముందుకు వచ్చుంటే 1:100కు జీవో ఇచ్చే వాళ్లం’ అని సీఎం తెలిపారు. ఇక ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని సీఎం.. పోలీసులను ఆదేశించారు. కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించండి.. అని పోలీసులకు సూచించారు.
Read Also : Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి