CM KCR : మళ్లీ `సెంటిమెంట్` ను రాజేస్తోన్న కేసీఆర్
ఒక వైపు జాతీయవాదం మరో వైపు ప్రాంతీయవాదంను ఈసారి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వినిపిస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటికీ సెంటిమెంట్ ను రాష్ట్రంలో నమ్ముకున్నారు. ఆ విషయం వికారాబాద్ సభలో ఆయన చేసిన ప్రసంగం స్పష్టం చేస్తోంది.
- By CS Rao Published Date - 12:00 PM, Wed - 17 August 22

ఒక వైపు జాతీయవాదం మరో వైపు ప్రాంతీయవాదంను ఈసారి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వినిపిస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటికీ సెంటిమెంట్ ను రాష్ట్రంలో నమ్ముకున్నారు. ఆ విషయం వికారాబాద్ సభలో ఆయన చేసిన ప్రసంగం స్పష్టం చేస్తోంది. తెలంగాణ పాలనలోని అభివృద్ధి మీద కంటే ప్రాంతీయవాదం, మోడీ వ్యతిరేకతను కేసీఆర్ నమ్ముకున్నట్టు అర్థం అవుతోంది. రెండుసార్లు సెంటిమెంట్ ను రంగరించడం ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా దాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
కృష్టా జలాల్లోని వాటాను అడ్డుపెట్టుకుని సెంటిమెంట్ ను రాజేసేందుకు సిద్ధం అయ్యారు. విభజన చట్టంలోని పలు అంశాలు ఉన్నప్పటికీ కేవలం నీళ్ల విషయాన్ని పైకి చూపుతున్నారు. కేంద్రం ఆధీనంలోకి కృష్ణాబోర్డును తప్పుబట్టేలా కేసీఆర్ ప్రసంగం సాగింది. 60ఏళ్లుగా ఆంధ్రోళ్ల కబంధ హస్తాల్లో ఉన్నామని సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు. ఇప్పుడు ప్రధాని మోడీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని బీజేపీని టార్గెట్ చేశారు. అంతేకాదు, తెలంగాణకు శతృవు ప్రధాని మోడీ అంటూ స్లోగన్ అందుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనకుండా కేసీఆర్ ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కూడిన కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఎజెండా అంటూ అడుగులు వేస్తున్నప్పటికీ కాంగ్రెస్ లేకుండా మోడీ ప్రత్యామ్నాయం సాధ్యంకాదని పీకే సర్వే చెబుతోంది. అందుకే, కాంగ్రెస్ పార్టీని ఒక భుజాన వేసుకుంటూ మరో భుజాన ఎంఐఎంను వేసుకుని నడుస్తున్నారు. ఇప్పటికే బీహార్ ఆపరేషన్ ను సైలెంట్ గా చేసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో లైజనింగ్ లో ఉన్నారని గులాబీ వర్గాల్లోని టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మేలనే ఆలోచనకు ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వికారాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం బీజేపీ టార్గెట్ ఆయన ప్రసంగం సాగింది.
బహుశా ఈసారి సెంటిమెంట్ పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే, గ్రేటర్ ఎన్నికల ఫలితాలను తీసుకుంటే, సెటిలర్లు ఎక్కువగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. సాధారణ ఎన్నికల్లో సెంటిమెంట్ ను రేపితే ఈసారి సెటిలర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే, సెంటిమెంట్ ను రంగరిస్తూ దాన్ని మోడీ వైపు తిప్పారు కేసీఆర్. తెలంగాణ పాలన మీద చర్చ లేకుండా చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ దాడిని ప్రారంభించారు. ఫలితంగా ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలోని లోపాలు, అక్రమాలు, అవినీతి అడుగున పడి పోతుందని గులాబీ వర్గాల ఆలోచన. ఇదే పంథాలను కొనసాగిస్తే, కేసీఆర్ మూడోసారి సీఎం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఫార్ములాను బెంగాల్ లోనూ`పీకే` ప్రయోగించారు. మూడోసారి మమతను సీఎంగా నిలపగలిగారు. కానీ, తెలంగాణ , బెంగాల్ ఓటర్ల ఆలోచన వేర్వేరు అనే సంగతి `పీకే` గుర్తించకపోవడం గమనార్హం.