CM KCR : మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. సింగరేణి కార్మికులపై వరాల జల్లు
సింగరేణి కార్మికులకు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. సింగరేణి(Singareni) కార్మికులకు వచ్చే దసరా(Dasara)కు రూ. 700 కోట్ల బోనస్ ఇస్తామని ప్రకటించారు.
- By News Desk Published Date - 10:00 PM, Fri - 9 June 23

సీఎం కేసీఆర్(CM KCR) మంచిర్యాల(Manichiryala) జిల్లాలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ప్రగతి నివేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, వికలాంగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. సింగరేణి(Singareni) కార్మికులకు వచ్చే దసరా(Dasara)కు రూ. 700 కోట్ల బోనస్ ఇస్తామని ప్రకటించారు. సింగరేణికి 134 ఏండ్ల చరిత్ర ఉంది. వాస్తవానికి అది మనకు సొంత ఆస్తి. నిజాం కాలంలో ప్రారంభమైంది. వేలాది మందికి అన్నంపెట్టింది. కాంగ్రెస్(Congress) పార్టీ హయాంలో సింగరేణిని సర్వనాశనం చేశారని, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా కింద అమ్మేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ(Telangana) ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత 11వేల కోట్ల సింగరేణి టర్నోవర్‌ను 33,000 కోట్లకు పెంచుకున్నాం. సింగరేణి లాభాలు 2,184 కోట్లు. దసరాకు సింగరేణి కార్మికులకు 700 కోట్ల బోనస్ ఇవ్వబోతున్నామని కేసీఆర్ అన్నారు. బీజేపీ సర్కార్ బొగ్గు గనులను ప్రయివేట్‌కు ఇచ్చి తాళం వేయిద్దామని చూస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో బొగ్గుకి కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. దేశంలోని బొగ్గు నిల్వలతో ప్రతి గ్రామానికి, పరిశ్రమకు150 ఏళ్ళు కరెంటు ఇవ్వొచ్చు. ఎంతో బొగ్గు ఉన్నా.. విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేస్తున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ నిండా ముంచాలని చూస్తోందని కేసీఆర్ విమర్శించారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో 6,453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్దరించి 19,463 ఉద్యోగాలను కల్పించామని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ధరణిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల భూములు ఆగం కావొద్దని ధరణి ప్రవేశపెట్టాం. ధరణి పోతే దళారుల రాజ్యం వస్తుంది. ధరణిని తీసేస్తా అన్నవాళ్ళని బంగాళాఖాతంలో కలపండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు వికలాంగులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచుతూ వచ్చే నెల నుండి 4100 ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
దేశంలో తలసరి ఆదాయంలో విద్యుత్ వినియోగం, తాగునీటి సౌకర్యంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందని కేసీఆర్ చెప్పారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో పండిందని చెప్పారు. కేంద్రం దుర్మార్గ పథకం వల్ల పామ్ అయిల్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని కేసీఆర్ అన్నారు. కుల వృత్తులకు లక్ష ఆర్థిక సహాయం, సొంత జాగా ఉన్నవాళ్లకు రూ. 3 లక్షలు ఇచ్చే గృహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. గతంలో గోదావరిలో నీళ్లు ఉండేవి కావు, ఇప్పుడు సజీవ గోదావరి కనబడుతుంటే కండ్ల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. వార్దా నదిపై త్వరలోనే బ్యారేజ్ నిర్మిస్తామని, లక్ష ఎకరాల సాగులోకి రాబోతుందని కేసీఆర్ చెప్పారు.