By Polls : అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు – కేటీఆర్
By Polls : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోయారని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు
- By Sudheer Published Date - 07:27 PM, Sun - 20 April 25

తెలంగాణ(Telangana)లో త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయని బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి (Vanam Sriramreddy) బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోయారని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. మహిళలు బస్సుల్లోనూ సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందని ధ్వజమెత్తారు.
Varuthini Ekadashi: వరూథిని ఏకాదశి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏమిటి?
రాష్ట్రంలో ఉప ఎన్నికలు (Bypoll) త్వరలోనే జరగబోతున్నాయని, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేవని, ఈ రెండు పార్టీలకు తెలంగాణ అభివృద్ధి మీద ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు. కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరణకు సిద్ధమవుతోందని, బీజేపీ, ఎంఐఎంలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ నెల 24న జరిగే ఓటింగ్‌ను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
“ఎన్నికలు ఈరోజు వచ్చినా, ఆరు నెలల తర్వాత వచ్చినా బీఆర్‌ఎస్ తిరిగి గెలుస్తుంది. గులాబీ జెండా మళ్లీ ఎగురుతుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు, ఇది ఎవ్వరు ఆపలేరు” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కసారి కూడా కాంగ్రెస్‌పై పోరాటం చేయలేదని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు విప్ జారీ చేయాలని, దానిని విస్మరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ గులాబీ దూకుడు ప్రారంభమవుతున్న సంకేతాలను కేటీఆర్ మాటలు చాటుతున్నాయి.