Hydraa : హైడ్రా బాధితులకు అండగా నిరసనల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్
Hydraa : బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచే ప్రశ్నే లేదన్నారు
- By Sudheer Published Date - 01:10 PM, Sun - 29 September 24

హైడ్రా (Hydraa) బాధితులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నేతలు సైతం రోడ్లపైకి వచ్చారు. మూసీ (Musi) ప్రక్షాళన పేరుతో తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చివేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు రోజులుగా మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తూ అక్రమ ఇళ్లను గుర్తిస్తున్నారు. దీనిపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలో బాధితులకు అండగా బిఆర్ఎస్ నిలిచింది. నిన్న తెలంగాణ భవన్ లో బాధితులతో మాట్లాడిన నేతలు..ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.
ఆదివారం హైదర్‌షా కోట్‌లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని, పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలన్నారు. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహిస్తున్నదని విమర్శించారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణలో ఈ బుల్డోజర్ రాజకీయాలేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచం లాగా నిలబడతామన్నారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచే ప్రశ్నే లేదన్నారు.
Read Also : Apples – Drugs : యాపిల్స్ మాటున డ్రగ్స్ దందా.. అడ్డంగా దొరికిపోయిన వ్యాపారి