Family Planning Ops Report: అసలు దోషి గడల శ్రీనివాసరావే.. మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి : రాణి రుద్రమ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలు మృతిచెందిన ఘటనపై సర్కారు తీరును బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఖండించారు.
- By Hashtag U Published Date - 11:05 AM, Sun - 25 September 22

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలు మృతిచెందిన ఘటనపై సర్కారు తీరును బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఖండించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమయ్యారన్నారు. కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనలో అసలు దోషి గడల శ్రీనివాసరావే అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి ఘటన దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం అన్యాయమని చెప్పారు. ఈ దర్యాప్తు బాధ్యతను గడల శ్రీనివాస రావుకు అప్పగించడం ద్వారా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కాపాడేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే మంత్రి హరీశ్‌రావును బర్తరఫ్ చేయాలన్నారు. లేదంటే స్వచ్చందంగా హరీష్ రావు రాజీనామా చేయాలని రాణి రుద్రమ డిమాండ్ చేశారు. గడల శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలన్నారు.
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన పై బిజెపికి చెందిన వైద్యుల బృందం దర్యాప్తు చేసి ఒక సమాంతర నివేదికను సిద్ధం చేసిందన్నారు.
శస్త్రచికిత్సలకు ఉపయోగించే మూడు సెట్ల లాప్రోస్కోపిక్ పరికరాలను రంగారెడ్డి జిల్లా ఆరోగ్య కార్యాలయం నుండి తీసుకువచ్చినట్లు కనుగొన్నారని ఆమె చెప్పారు. ఈ పరికరాలను చివరిసారిగా కోవిడ్ మహమ్మారి ప్రారంభానికి ముందు ఉపయోగించారని తేలిందన్నారు.
వాటిని క్లీన్ గా స్టెరిలైజ్ చేయకుండా వాడటం వల్లే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు ఇన్ఫెక్షన్ సోకిందని బీజేపీ వైద్యుల దర్యాప్తులో వెల్లడి అయిందని చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సరైన విచారణ జరిపేందుకు సివిల్ జడ్జి నేతృత్వంలో గైనకాలజిస్ట్, సర్జన్‌తో సహా అర్హత కలిగిన వైద్యులతో కొత్త విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని రాణి రుద్రమ కోరారు.