MP Arvind: టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తే గొంతు కోసుకుంటా..నవంబర్ 20 డెడ్‌లైన్..!!
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. అయినప్పటికీ...రాజకీయ వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
- By Hashtag U Published Date - 01:38 AM, Sun - 24 April 22

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. అయినప్పటికీ…రాజకీయ వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఈ క్రమంలో కార్యచరణ అమలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ అరాచకాలు..అవినీతి అంటూ బీజేపీ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని బండి సంజయ్ అంటుంటే…మోదీని జైళ్లో పెడతామని అనలేమా అంటూ కేటీఆర్ ప్రకటనలు చేస్తున్నారు. వీటికి తోడుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పటివరకు గులాబీ నేతలు ఎవరూ చేయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆరెస్ అధికారంలోకి వస్తే…తాను గొంతు కోసుకుంటానని సవాల్ విసిరారు.
ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆత్మహత్య చేసుకునన తల్లీకొడుకుల కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయని…వ్యాపారం చేసుకుంటున్న సంతోష్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి…ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి సవాల్ విసిరారు అర్వింద్.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న అరాచకాలకు కేసీఆర్, కేటీఆర్ బాధ్యులని అర్వింద్ ఆరోపించారు. కేటీఆర్ అండతోనే…గులాబీనేతలు, వారి ప్రోద్బలంతో పోలీసులు రెచ్చిపోతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇఛ్చారు. అయితే టీఆరెస్ పార్టీ సీబీఐ ఎంక్వైరీకి అడ్డుపడుతుందని…కేసీఆర్ సీబీఐని ఎంతో కాలం నిలువరించలేరన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆరెస్ మళ్లీ గెలుస్తే తాను గొంతు కోసుకుంటాని ఎంపీ ఛాలెంజ్ విసిరారు. మీడియా ముఖంగానే ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ కు ఈసారి కుక్క కూడా ఓటు వేయదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై టీఆరెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.