Mutthi Reddy daughter: ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చిన కూతురు.. ఈసారి భవానీ రెడ్డి ఏం చేసిందంటే..?
మా నాన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ భూమిని కబ్జాచేసి నాపేరుమీద రాశాడు. అందుకు ఇక్కడి ప్రజలకు క్షమాపణలు కోరుతున్నా. ఈ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తా అని ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ అన్నారు.
- By News Desk Published Date - 08:40 PM, Sun - 25 June 23

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) కి అతని కుమార్తె తుల్జా భవానీ రెడ్డి (Bhavani Reddy) షాక్‌లమీద షాక్‌లు ఇస్తుంది. కొద్దిరోజులుగా తన తండ్రి నాపేరుపై నా ప్రమేయం లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేశాడని, అది కబ్జా భూమి అని ఆరోపించింది. అంతేకాదు, ముత్తిరెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే.. అక్కడికి వెళ్లి తన సంతకం ఎందుకు పెట్టావ్ అంటూ నిలదీసింది. తన తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనపేరుపై భూమిని కొనుగోలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. అయితే, ముత్తిరెడ్డి కుమార్తె వ్యాఖ్యలను ఖండించారు. అది కబ్జా భూమి కాదని, నా కుమార్తెకు నా భూమి ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
తుల్జా భవానీ రెడ్డి తన తండ్రి ముత్తిరెడ్డికి మరోసారి షాకిచ్చింది. ఆదివారం సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి కింద తన పేరుపై ఉన్న స్థలం వద్దకు భవాని రెడ్డి వెళ్లింది. నా తండ్రి ముత్తిరెడ్డి నాపేరుపై అక్రమంగా ఈభూమిని రిజిస్ట్రేషన్ చేశారని చెప్పింది. ఈ సందర్భంగా 1200 గజాల భూమి చుట్టూ ప్రహారీని ఆమె తొలగించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన స్థలాన్ని కోర్టు ద్వారా చేర్యాలీ మున్సిపాలిటీకి అప్పగిస్తామని చెప్పింది. ఎమ్మెల్యే కాకముందే మా నాన్నకు వెయ్యికోట్లకుపైగా ఆస్తి ఉందని, ఇప్పుడు 70ఏళ్లు వచ్చాయని, అద్దెల మీదనే నెలకు కోట్లరూపాయలు వస్తాయని భవాని తెలిపింది.
అయినా మా నాన్న ఈ భూమిని కబ్జాచేసి నాపేరుమీద రాశాడని, అందుకు ఇక్కడి ప్రజలకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. అనంతరం భవానీ రెడ్డి ఓ బోర్డుపై చేర్యాలీ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు రాసి ఆ స్థలంలో బోర్డును ఉంచింది. అయితే, తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధనదాహానికి వేరేవాళ్లెందుకు బలికావాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాని ఎమ్మెల్యే కుమార్తె భవానీరెడ్డి తెలిపింది.