Gaddar 77th Birth Anniversary Celebrations : గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు – భట్టి విక్రమార్క
Gaddar 77th Birth Anniversary Celebrations : గద్దర్ సేవలను గౌరవిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు
- By Sudheer Published Date - 10:40 PM, Fri - 31 January 25

హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ 77వ జయంతి ఉత్సవాలు (Gaddar 77th Birth Anniversary Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రసంగిస్తూ.. గద్దర్ భావజాలాన్ని క్యాబినెట్ మొత్తం నమ్ముతుందని తెలిపారు. గద్దర్ సేవలను గౌరవిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
గద్దర్ అందరికీ చదువు అందాలని కలలుగన్నారు. ఆ ఆలోచన మేరకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే గద్దర్ ఆలోచనలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవుడిగా నిలిచిన గద్దర్, తన సాహిత్యం, ఉద్యమాలతో సమాజంలో మార్పు తీసుకొచ్చారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం కోసం గద్దర్ చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ, ఆయన పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గత దశాబ్ద కాలంగా అవార్డులు మరిచిన సినిమా కళాకారులకు వచ్చే ఉగాదిన గద్దర్ పేరుతో అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. గద్దర్ ప్రజల కష్టాలను తన పాటల ద్వారా వినిపించిన గొప్ప గాయకుడు, కవి అని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తన తల్లి రూపంలో పాటగా అందించిన మహిళా పక్షపాతిగా గద్దర్ నిలిచారన్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ మేల్కొల్పారని గుర్తుచేశారు.
గద్దర్ తెలంగాణ కోసం నిజమైన పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా భావిస్తున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం గద్దర్‌కు పద్మ పురస్కారం ప్రకటించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆయన గౌరవాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు.
Read Also : DDCA Felicitates Virat Kohli: అప్పుడు కోహ్లీని మర్చిపోయిన ఢిల్లీ.. ఇప్పుడు ప్రత్యేక గౌరవం!