Modi On Telangana : మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
- By Siddartha Kallepelly Published Date - 05:52 PM, Wed - 9 February 22

తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. అయితే టీఆర్ఎస్ చర్యలపై తెలంగాణ బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మోదీ కేసీఆర్ ని తీడితే టీఆర్ఎస్ కు కలిగే బాధ ఏంటని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ని నమ్మే స్థితిలో లేరని, ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పేపర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ పార్టీ సభ్యులని, ఆ సమయంలో కెసిఆర్ ఎక్కడున్నారని సంజయ్ ప్రశ్నించారు. స్ప్రే కొట్టినా పారిపోకుండా తెలంగాణ ప్రజల కోసం నిలబడి బీజేపీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని, తెలంగాణ బిల్లు పెడతారా లేదా అని సుష్మ నిలదీయడం వల్లే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టిందని సంజయ్ తెలిపారు.
మోదీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్ అబద్దాలను ప్రచారం చేస్తోందని సంజయ్ స్పష్టం చేశారు. కెసియర్ పెద్ద జోకర్ అని ఆయన తెలిపారు. కెసిఆర్ కు తెలంగాణ ఉద్యమ స్పూర్తి లేదని, ఆయన కేబినెట్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారని సంజయ్ ప్రశ్నించారు. పక్కరాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే కెసిఆర్ మాత్రం ఫామ్ హౌజ్ కె పరిమితమయ్యారని సంజయ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ పద్దతులతో ఉద్యమం కోసం బలిదానం చేసుకున్న అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని సంజయ్ తెలిపారు.
తెలంగాణ కోసం కెసిఆర్ చేసింది ఏమీ లేదని తెలిపిన సంజయ్ కెసిఆర్ కి ఏ విషయంలోనూ స్పష్టత ఉండదని పేర్కొన్నారు. రాజ్యాంగం మార్చాలన్న కెసిఆర్ కి అందులో ఏ అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయో చెప్పట్లేదని, అలాగే అంబేడ్కర్ విగ్రహం ఎప్పటిలోగా పెడుతారనే విషయంలో కూడా కెసిఆర్ కి క్లారిటీ లేదని సంజయ్ విమర్శించారు.