Banakacharla Project : సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కవిత డిమాండ్
Banakacharla Project : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha), సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు
- Author : Sudheer
Date : 17-07-2025 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha), సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసం తీసుకొస్తున్నారని ఆరోపించిన ఆమె, దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మెగా సంస్థల ప్రయోజనాల కోసం రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
రేవంత్ రాజీనామా చేయాలని కవిత డిమాండ్
చేతకాని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడం రాష్ట్రానికి హానికరం అని పేర్కొన్న కవిత, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి ముందు బనకచర్లపై చర్చల్లో పాలుపంచుకోమని చెప్పిన రేవంత్, చివరికి చర్చల్లో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ప్రకటన, కేంద్ర ప్రెస్ నోట్ లో బనకచర్లపై చర్చ జరిగినట్టు స్పష్టం అయిన నేపథ్యంలో, రేవంత్ మోసపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
బనకచర్లపై న్యాయపోరాటానికి సిద్ధం
బనకచర్ల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను కాపాడేందుకు న్యాయపోరాటం చేస్తామని ప్రకటించిన కవిత, పార్లమెంట్ సమావేశాల సమయంలో తెలంగాణ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితేనే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రంపై, న్యాయవ్యవస్థలపై తమకు పూర్తి నమ్మకముందని అన్నారు.
తీన్మార్ మల్లన్న అసలు జనాభా లెక్కల్లోనే లేడు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై స్పందించిన కవిత, ఆయనను జనాభా లెక్కలోకి కూడా తీసుకోవద్దని విమర్శించారు. తాను ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదని, ఆయన గురించి మాట్లాడడం కూడా అవసరం లేదన్నారు. మరోవైపు, కొప్పుల ఈశ్వర్‌కి టీఆర్‌ఎస్ బొగ్గుగని కార్మిక సంఘ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని స్వాగతించారు. బొగ్గుగనిలో పనిచేసిన అనుభవం ఉన్న నేతగా ఆయన కార్మికుల సమస్యలను అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు.