Asaduddin Owaisi : పాలకులు ఫారోలుగా మారితే మోసెస్ వస్తాడు : ఒవైసీ
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో మజ్లిస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.
- By Pasha Published Date - 09:29 AM, Mon - 1 April 24

Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో మజ్లిస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా యూపీలోని స్థానిక రాజకీయ పక్షం అప్నాదళ్ (కమేరావాది)తో జట్టుకట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఉన్న ముఖ్తార్ అన్సారీ నివాసానికి అసదుద్దీన్ వెళ్లారు. ఇటీవల జైలులో అనుమానాస్పద స్థితిలో ముఖ్తార్ అన్సారీ చనిపోయారు. ఈసందర్భంగా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను అసదుద్దీన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు. ముఖ్తార్ అన్సారీ చిన్న కొడుకు ఉమర్ అన్సారీ, ముఖ్తార్ అన్సారీ అన్నయ్య అఫ్జల్ అన్సారీలను ఆయన ఓదార్చారు. జైలులో ముఖ్తార్ అన్సారీ అనుమానాస్పద మరణంపై మజ్లిస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అల్లా దయతో ఈ చీకటిని వెలుగు ఛేదిస్తుంది. బీజేపీ నాయకులు ఫారో అయితే.. వాళ్లను తన్ని తరిమేసే మోసెస్ కూడా ఖచ్చితంగా వస్తాడు’’ అని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కామెంట్ చేశారు. ఒవైసీ వెంట ఉత్తరప్రదేశ్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు షౌకత్ అలీ కూడా ఉన్నారు. కాగా, ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో చనిపోయారని పోస్టుమార్టం రిపోర్టు చెబుతుంటే.. ఆహారంలో విషం కలిపి తినిపించి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
आज मरहूम #मुख्तार_अंसारी के घर #गाजीपुर जाकर उनके खानदान को पुरसा दिया, इस मुश्किल वक्त में हम उनके खानदान, समर्थक और चाहने वालों के साथ खड़े हैं।
इंशा अल्लाह इन अंधेरों का जिगर चीरकर नूर आएगा,
तुम हो 'फिरौन' तो 'मूसा' भी जरूर आएगा।pic.twitter.com/oDQAbwNIiI
— Asaduddin Owaisi (@asadowaisi) March 31, 2024
We’re now on WhatsApp. Click to Join
యూపీలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ (కమేరావాది)తో కలిసి మజ్లిస్ పోటీ చేయనుంది. ‘పిచ్డా, దళిత్ ఔర్ ముసల్మాన్’ (పీడీఎం) పేరుతో ఏర్పాటైన ఈ కూటమికి అప్నా దళ్ అగ్ర నాయకురాలు పల్లవి పటేల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సారథ్యం వహించనున్నారు. ప్రేమ్‌చంద్ బింద్‌కు చెందిన ప్రగతిశీల మానవ్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంతకుముందు సమాజ్ వాదీ పార్టీతో అప్నా దళ్‌కు పొత్తు ఉండేది. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్ చీఫ్ పల్లవి పటేల్ సమాజ్ వాదీ పార్టీ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగగా.. ఓ దళిత అభ్యర్థికి పల్లవి పటేల్ ఓటు వేశారు. మిగతా ఇద్దరికి ఓటు వేసేందుకు నో చెప్పారు. దీంతో అప్నాదళ్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది.