Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు
Telangana Check Post : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ చెక్‌పోస్టులపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- By Sudheer Published Date - 08:27 PM, Wed - 22 October 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ చెక్‌పోస్టులపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు అక్టోబర్ 22న బుధవారం వెలువడ్డాయి. ఇటీవల ఆంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు సంగారెడ్డి, కామారెడ్డి, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో భారీ అవినీతి బయటపడింది. అక్రమ వసూళ్లు, లంచాల వ్యవహారాలు బయటపడటంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా శాఖ చెక్‌పోస్టులు వాహనదారులకు భారంగా మారడమే కాకుండా, అవినీతి కేంద్రాలుగా మారాయని నివేదికలు వెల్లడించాయి.
Toyota e-Palette: టయోటా నుంచి కొత్త వాహనం.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు జర్నీ!
కమిషనర్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, చెక్‌పోస్టుల కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలి. రాష్ట్రంలోని 14 బార్డర్ చెక్‌పోస్టులను పూర్తిగా మూసివేయడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇతర శాఖలకు లేదా కార్యాలయాలకు తరలించాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారికేడ్లు, సిగ్నేజ్‌లను తొలగించి, వాహన రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెక్‌పోస్టుల్లో ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను సమీప జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలకు తరలించాలి. ఈ మూసివేత ప్రక్రియపై సమగ్ర నివేదికను అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహార పదార్థాలివే!
జీఎస్‌టీ అమలు తరువాత రవాణా చెక్‌పోస్టుల అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో వాహన పన్నులు, పర్మిట్లు, ట్యాక్స్ చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వాహన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసి, స్వచ్ఛంద ట్యాక్స్ చెల్లింపులు, పర్మిట్ జారీలను సులభతరం చేయనున్నారు. చెక్‌పోస్టుల స్థానంలో మొబైల్ స్క్వాడ్లు ఆరు నెలలపాటు పర్యవేక్షణ చేస్తాయి. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల సాయంతో ఈ-ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను అమలు చేయనున్నారు. అవినీతి రహిత రవాణా వ్యవస్థకు ఇది తొలి పెద్ద అడుగుగా భావిస్తున్నారు.