Success Stories : నైట్ వాచ్‌మన్‌కు మూడు జాబ్స్.. గృహిణికి రెండు జాబ్స్
Success Stories : సామాన్యులు అసామాన్య విజయం సాధించారు.
- Author : Pasha
Date : 01-03-2024 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
Success Stories : సామాన్యులు అసామాన్య విజయం సాధించారు. చిన్నచిన్న పనులు చేస్తూ.. కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేరై.. పెద్ద ఉద్యోగాలను సంపాదించారు. వారి వజ్ర సంకల్పానికి పేదరికం తలవంచింది. గెలుపు వరించింది. ఆ ఇద్దరు తెలంగాణ ఉద్యోగ విజేతల వివరాలపై కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
ప్రవీణ్ గ్రేట్..
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పెద్దులు, పోసమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్. పెద్దులు తాపీ మేస్త్రీ కాగా.. పోసమ్మ బీడీ కార్మికురాలు. ఈ దంపతులు కష్టపడి తమ కుమారుడు ప్రవీణ్‌ను చదివించారు. ఓయూ క్యాంపస్‌లో ఎంకాం, బీఈడీ, ఎంఈడీ కోర్సులను అతడు పూర్తిచేశాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రిసర్చ్ సెంటర్ (ఈఎంఆర్‌సీ)లో నైట్ వాచ్‌మన్‌గా ప్రవీణ్ పనిచేసేవాడు. అతడు నైట్ వాచ్‌మన్‌గా పనిచేసుకుంటూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ప్రవీణ్ పదిరోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ‘నేను ఉద్యోగం చేస్తున్నానని ఎప్పుడూ అనిపించలేదు.. నాకు ఒక గది, అందుబాటులో పుస్తకాలు, మెటీరియల్.. చదువుకోవడానికి సమయం దొరికింది’ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం కావడంతో పగలు ఎక్కువ గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించే అవకాశం దక్కిందన్నాడు.
Also Read : LAWCET 2024 : లాసెట్ దరఖాస్తు ప్రక్రియ షురూ.. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల వివరాలివీ
చీకటి జ్యోతి.. విజయాల వెలుగు
కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి, నవీన్ దంపతులు 2018 నుంచి చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణలో భర్తకు సాయంగా ఉంటూనే.. ఆమె ఎంఏ, బీఈడీ కోర్సులను పూర్తి చేశారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ పరీక్ష రాశారు. వారం కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. గురువారం వెలువరించిన జూనియర్ అధ్యాపకుల ఉద్యోగాల ఫలితాల్లోనూ ఆమె అర్హత సాధించారు. చీకటి జ్యోతి, నవీన్ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు.