‘డార్ట్’ ప్రయోగం విజయవంతం.. కొత్తగా సెలబ్రేట్ చేసిన గూగుల్
భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ
- By Anshu Published Date - 07:00 PM, Tue - 27 September 22

భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘డార్ట్’ (Double Asteroid Redirection Test) మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగం కోసం డిడిమోస్, డైమార్ఫస్ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ఈ ప్రయోగంలో భాగంగా నాసా స్పేస్‌క్రాఫ్ట్ డైమార్ఫస్‌ను భారత్ కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ఢీకొట్టింది.
గ్రహశకల ప్రమాదాల నుంచి భూమిని రక్షించేందుకు ఉద్దేశించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్ (Mission) ఇది. పది నెలలుగా అంతరిక్షంలో తిరుగుతున్న ‘డార్ట్’ ఈ విజయం సాధించినట్టు మేరీల్యాండ్‌లోని లారెల్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) మిషన్ కంట్రోల్ ప్రకటించింది. 530 అడుగుల (160 మీటర్లు) వెడల్పు ఉన్న డైమోర్ఫోస్ గమనాన్ని మార్చేందుకు డార్ట్ ఉద్దేశపూర్వకంగానే దానిని ఢీకొట్టింది.
భూమికి 7 మిలియన్ మైళ్ల (11 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఏపీఎల్ తెలిపింది. డైమోర్ఫోస్ గ్రహశకలం డిడిమోస్ అనే 2,560 అడుగుల (780 మీటర్ల) భారీ గ్రహశకలం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల భూ గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. డార్ట్ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా భవిష్యత్తులో భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించే అవకాశం లభించింది.
కొత్తగా సెలబ్రేట్ చేసిన గూగుల్
భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహ శకలాలను ఢీ కొట్టి దారి మళ్లించేందుకు నాసా ప్రయోగించిన ‘డార్ట్’ వ్యోమనౌక ప్రయోగం విజయవంతం కావడంతో.. టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్తగా స్పందించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ డార్ట్‌ను పోలి ఉన్న వ్యోమనౌక యానిమేషన్‌ను క్రియేట్ చేసింది. ‘DART Mission’ అని గూగుల్ సెర్చ్ చేయగానే గ్రహశకలాన్ని ఢీకొట్టిన అనుభూతి వచ్చేలా యానిమేషన్ రూపొందించింది.