Chinese Rocket: హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్ .. ఎందుకు, ఎలా ?
23 టన్నుల బరువు ఉండే చైనా రాకెట్ "లాంగ్ మార్చ్ – 5బీ" కలవరపెట్టింది. రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయే సందర్భంలో లోపం తలెత్తింది.
- By Hashtag U Published Date - 11:42 AM, Sun - 31 July 22

23 టన్నుల బరువు ఉండే చైనా రాకెట్ “లాంగ్ మార్చ్ – 5బీ” కలవరపెట్టింది. రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయే సందర్భంలో లోపం తలెత్తింది. దీంతో నింగి వైపు దూసుకెళ్ళాల్సిన రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి వైపు పడిపోయింది. ఈక్రమంలో అది పేలిపోయి తునాతునకలు అయింది. దాని శిథిలాలు సరైన విధంగా భూమి వాతావరణంలోకి రాలేదు. దీంతో సమస్య మొదలైంది. చివరకు శనివారం రాత్రి 10.45 సమయంలో హిందూ మహాసముద్రంలో రాకెట్ శిథిలాలు పడిపోవడంతో గండం గట్టెక్కింది.
రాకెట్ శిథిలాలు భూకక్ష్యలోకి ప్రవేశించగానే, అవి ఉల్కలని భావించి తూర్పు, దక్షిణాసియా దేశాల్లోని చాలా చోట్ల ప్రజలు చాలామంది వీడియోలు తీసుకొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. హిందూ మహాసముద్రంలో రాకెట్ శిథిలాలు పడిపోయాయనే విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ కూడా ధృవీకరించింది. చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏమిటీ రాకెట్ ?
చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ ను నిర్మిస్తోంది. అయితే ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని మాడ్యుళ్లను అంతరిక్షంలోకి పంపేందుకు “లాంగ్ మార్చ్ – 5బీ” రాకెట్ ను చైనా వినియోగిస్తోంది. లాంగ్ మార్చ్ – 5బీ రాకెట్ ను జూలై 24న వెన్ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి చైనా ప్రయోగించింది. రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయిన సందర్భంలో.. అది సరైన విధంగా భూమి వాతావరణంలోకి రాలేదు. దీంతో సమస్య మొదలై రాకెట్ పేలిపోయింది. మలేషియా గగనతలం మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తున్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్‌ఫీల్డ్ కూడా షేర్ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు.
https://twitter.com/nazriacai/status/1553424586624335872